
న్యూఢిల్లీ : ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించి జమ్ముకాశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లాలోని 45 ప్రాంతాల్లో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఎ) సోదాలు చేపట్టింది. దోడా, కిస్తావర్, రాంబన్, అనంత్ నాగ్, బుద్గాం, సోఫియాన్, ఇతర ప్రాంతాల్లో జమ్ముకాశ్మీర్ పోలీసులు, సిఆర్‌పిఎఫ్ సంయుక్తంగా తనిఖీలు చేపట్టాయి. జమాత్ ఇ ఇస్లామి (జెఇఐ) సభ్యుడు గుల్ మహ్మద్ నివాసంలో కూడా సోదాలు చేపట్టారు. 2019లో ఈ పార్టీపై నిషేధానికి గురైంది. గత నెలలో హోం మంత్రిత్వ శాఖ సమీక్షలో స్థానికంగా జమాత్ ఇ ఇస్లామి పార్టీ పెరుగుతున్న ప్రాబల్యం గురించి చర్చ జరిగినట్లు తెలుస్తోంది. యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపకుండా ఆపేందుకు చర్యలు తీసుకోవాలని హోం శాఖ మంత్రి అమిత్‌షా భద్రతా దళాలను కూడా కోరారు. జులై 10న, ఉగ్రవాద నిధుల కేసుకు సంబంధించిన జమ్ముకాశ్మీర్ వ్యాప్తంగా ఆరుగురిని దర్యాప్తు సంస్థ అరెస్టు చేసింది. ప్రభుత్వంలోని 11 మంది ఉద్యోగులకు ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నాయన్న కారణంతో తొలగించిన మరుసటి రోజు ఈ సోదాలు చోటుచేసుకున్నాయి. తొలగించిన వారిలో ఉగ్రవాద సంస్థ హిజుబుల్ ముజాయిద్దీన్ వ్యవస్థాపకుడు సయ్యద్ సలాహుద్దీన్ ఇద్దరు కుమారులు ఉన్నారు.