Oct 12,2021 06:28

ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకపోవడంతో సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. ప్రభుత్వం ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా లేదు. ఎందుకంటే ప్రజలను పత్రికా రంగానికి దూరం చేయడం ద్వారా కోల్పోయేది ఏమీ లేదని భావిస్తోంది. తాము సాధారణ రిపోర్టింగ్‌ చేయడం అసాధ్యంగా మారిందని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. దీన్ని కోర్టులు తీవ్రంగా పరిగణన లోకి తీసుకోవాలి. ఫోర్త్‌ ఎస్టేట్‌ హోదాను పునరుద్ధరించడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. జర్నలిస్టులు, వార్తాపత్రికలపై దాఖలైన కేసులన్నింటినీ పరిగణన లోకి తీసుకోవాలి. కోర్టులు మరో రకంగా వ్యవహరించినట్లైతే అది ప్రజాస్వామ్యానికి శుభం కాబోదు.

    2019 ఆగస్టు 5న 370వ అధికరణను రద్దు చేయడంతో జమ్మూ కాశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛకు పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. ఇది తప్పుడు సమాచార సమస్యకు దారి తీసింది. ఆ ప్రాంతంలో తీవ్ర ఆందోళన కలిగించింది. కాశ్మీరు లోయలో పరాయివారమనే భావన దేశ ప్రయోజనాలతో పాటు కాశ్మీరీల ప్రయోజనాలకు కూడా తీవ్ర ఇబ్బందికరంగా పరిణమించింది.
     చారిత్రకంగా, జమ్మూ కాశ్మీర్‌లో పత్రికలు ప్రజాస్వామ్య, ఫ్యూడల్‌ వ్యతిరేక, లౌకికవాద పోరాటాలను ప్రముఖంగా పేర్కొంటూ వచ్చాయి. మహరాజా వ్యవస్థను రద్దు చేసి...ప్రజాస్వామ్య, లౌకికవాద భారత దేశానికే షేక్‌ అబ్దుల్లా నేతృత్వం లోని రాజకీయ నాయకత్వం ఓటు వేయడంతో...కాశ్మీర్‌, భారత్‌తో విలీనమయ్యే ప్రయత్నాలకు పత్రికా రంగం మద్దతిచ్చింది. భారత్‌తో విలీనమవ్వాలని, షేక్‌ అబ్దుల్లాను విడుదల చేయాలని డిమాండ్‌ చేసినందుకు 1947 జూన్‌లో ఉర్దూ దినపత్రిక రణబీర్‌ను రాజరిక వ్యవస్థ నిషేధించింది. ఆ తర్వాత ఆ నిషేధాన్ని ఎత్తివేశారు. ఉర్దూ వారపత్రిక సంపాదకుడు పుకార్‌ను కూడా 1942లో రాజరిక వ్యవస్థ బెదిరించింది. మహాత్మా గాంధీ నేతృత్వంలోని క్విట్‌ ఇండియా ఉద్యమానికి ఆ పత్రిక మద్దతిచ్చింది.
 

                                                 ప్రభుత్వ నియంత్రణలో పత్రికా రంగం

    ఈ రోజుల్లో కాశ్మీర్‌ లోని పత్రికలను ఉదయాన్నే చూడాలంటే బాధాకరంగా వుంటోంది. జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల గురించి ఏ సమాచారం వుండదు. కేవలం ప్రభుత్వ పత్రికా ప్రకటనలే వుంటాయి. రాజకీయ పార్టీలకు, వారి స్టేట్‌మెంట్లకు ఎక్కడా అవకాశమే వుండదు. వార్తా పత్రికల్లో ప్రధానంగా వాణిజ్య ప్రకటనలు వస్తాయి లేదా ప్రభుత్వ అధికారుల, ప్రభుత్వం లోని సీనియర్ల అడ్వర్టయిజ్‌మెంట్‌-కమ్‌-స్టేట్‌మెంట్లు వుంటాయి. మీడియా విశ్లేషణను నియంత్రించేందుకు సంపాదకులపై ఒత్తిడి తీసుకువచ్చే సాధనంగా ప్రభుత్వ వాణిజ్య ప్రకటనలను ఉపయోగిస్తారు. ఒకవేళ వార్తాపత్రిక అందుకు అనుగుణంగా వ్యవహరించకపోతే కఠిన చర్యలు ఎదుర్కొనాల్సి వుంటుంది. వాణిజ్య ప్రకటనలు అర్ధంతరంగా రద్దవుతాయి. లేదా దర్యాప్తు సంస్థలు దాడులు నిర్వహిస్తాయి. తమను పిలవడం, తమ గురించి, తమ బంధువుల గురించి సమాచారం తెలుసుకోవడం పోలీసులకు చాలా సర్వసాధారణమై పోయిందని జర్నలిస్టు మిత్రులు మాకు చెబుతూ వుంటారు. ఈ చర్యలు, పత్రికా స్వేచ్ఛ (అంటే రాజ్యాంగం లోని భావ ప్రకటనా స్వేచ్ఛే) ముప్పును ఎదుర్కొంటోందని విస్తృత జర్నలిస్టు కమ్యూనిటీకి సందేశం పంపుతాయి.
    సమర్ధవంతంగా మీడియా నోరు నొక్కేలా 2020లో సవరించిన మీడియా విధానాన్ని ప్రభుత్వం తీసుకువచ్చినప్పటి నుండి మరింతమంది జర్నలిస్టులు వేధింపులకు గురవుతున్నారు. జర్నలిస్టులను అడ్డగిస్తున్నారని, వేధిస్తున్నారని వస్తున్న ఆరోపణలపై విచారణ జరిపేందుకు ముగ్గురు సభ్యులతో నిజ నిర్ధారణ కమిటీని ప్రెస్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఇండియా ఏర్పాటు చేసింది. ప్రెస్‌ కౌన్సిల్‌ జమ్మూ కాశ్మీర్‌లో పర్యటించాల్సి వుంది. మీడియా గ్రూపులతో ఏ విధమైన చర్చలు జరపకుండా రూపొందించిన ఈ మీడియా విధాన ఉద్దేశ్యం స్థానిక మీడియాను సాధ్యమైనంతవరకు పక్కకు నెట్టి ప్రభుత్వ విశ్లేషణను లేదా కథనాన్ని రూపొందించడమే. ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌లో పత్రికా రంగం ప్రభుత్వ అధీనంలోనే వుంది.
 

                                               తప్పుడు సమాచారాన్ని నివారించే వ్యూహం

    జమ్మూ కాశ్మీర్‌లో పత్రికా స్వేచ్ఛ నిరాకరించబడడాన్ని విస్తృత కోణం లోంచి చూడాల్సి వుంది. మొదటగా, ఈ సామాజిక మాధ్యమాల యుగంలో, ఎన్‌క్రిప్టెడ్‌ వేదికల ద్వారా సమాచారం, కథనాలు పంచుకునే తరుణంలో, సాధారణ ప్రజలకు తప్పుడు సమాచారం, బూటకపు వార్తలు చేరకుండా కాపాడడమనేది కీలకంగా మారింది. ఇందులో ప్రభుత్వ మీడియా సంస్థలకూ పాత్ర వున్నప్పటికీ, పెద్ద సంఖ్యలో ప్రజలు మరింత విశ్వసనీయమైన, స్వతంత్రమైన సమాచార మూలాల పైనే ఆధారపడతారు. ఈ నేపథ్యంలో, ప్రొఫెషనల్‌ రిపోర్టర్లను ఎలాంటి ఒత్తిడి లేదా ముప్పులు ఎదుర్కొనకుండా తమ విధులను నిర్వర్తించడానికి అనుమతించడమనేది తప్పుడు సమాచారాన్ని నివారించే ఏ వ్యూహానికైనా కీలకంగా వుంటుంది. ఇంత జరిగినా, జర్నలిస్టులు తమ వార్తాపత్రికల సంపాదకులకు జవాబుదారుగా వుంటారు. అంతేగాక, ఆ సంపాదకులు ఆ ప్రాంత చట్టాలకు కట్టుబడి వుండాల్సిందే. లేనిపక్షంలో, ప్రభుత్వ పత్రికా ప్రకటనలతో వార్తాపత్రికలను భర్తీ చేసే వాతావరణంలో ప్రజలు అసంకల్పితంగా, చాలా సులభంగా అందుబాటులో వుండే సామాజిక మాధ్యమాలను ఆశ్రయిస్తారు. సంచలనాత్మకమైన, తప్పుడు సమాచారాన్ని ప్రజలకు చేరవేయడంలో ఈ సామాజిక మాధ్యమాల వేదికలు పేరొందాయి. కాశ్మీర్‌లో, సమాచార శూన్యత అనేది బూటకపు వార్తలకు నెలవుగా మారింది. దీనితో భద్రతాపరమైన చిక్కులు, పర్యవసానాలు కూడా వుంటాయి.
    ఇక రెండవది, ప్రస్తుతం జమ్మూ కాశ్మీర్‌ వివిధ కథనాలకు యుద్ధభూమిగా వుంది. సత్యం, నిజాయితీ మూలాలు కలిగిన విశ్వసనీయమైన కథనమే ఈ పోరాటంలో గెలుపొందుతుంది. స్వేచ్ఛా వాతావరణంలో వృత్తి పట్ల అంకిత భావం కలిగిన విలేకరులు సమాచారాన్ని సేకరించడానికి, సంపాదకులు తమ సంపాదకీయాలను పంచుకోవడానికి అనుమతించడం ద్వారా దీన్ని సాధించవచ్చు. ప్రజాస్వామ్య ప్రభుత్వం లేకపోవడంతో సమస్య పరిష్కారానికి అన్ని అవకాశాలు మూసుకుపోయాయి. ప్రభుత్వం ప్రజల మనోభిప్రాయాలకు అనుగుణంగా లేదు. ఎందుకంటే ప్రజలను పత్రికా రంగానికి దూరం చేయడం ద్వారా కోల్పోయేది ఏమీ లేదని భావిస్తోంది. తాము సాధారణ రిపోర్టింగ్‌ చేయడం అసాధ్యంగా మారిందని జర్నలిస్టులు పేర్కొంటున్నారు. దీన్ని కోర్టులు తీవ్రంగా పరిగణన లోకి తీసుకోవాలి. ఫోర్త్‌ ఎస్టేట్‌ హోదాను పునరుద్ధరించడానికి న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకోవాలి. జర్నలిస్టులు, వార్తాపత్రికలపై దాఖలైన కేసులన్నింటినీ పరిగణన లోకి తీసుకోవాలి. కోర్టులు మరో రకంగా వ్యవహరించినట్లైతే అది ప్రజాస్వామ్యానికి శుభం కాబోదు.
     మరింత విస్తృతంగా చెప్పాలంటే, పత్రికా స్వేచ్ఛను అందించే భారతీయ ప్రజాస్వామ్య సాంప్రదాయాలతో జమ్మూ కాశ్మీర్‌ను విలీనం చేయడానికి తిరస్కరించడం, దేశంతో జమ్మూ కాశ్మీర్‌ భావోద్వేగ సంబంధాలకు ప్రధాన అవరోధంగా కొనసాగనుంది. ''ఈ వాగ్దానాలు కాశ్మీర్‌ ప్రజలకు అవమానకరం మాత్రమే కాకుండా, అన్ని ప్రజాస్వామ్య సున్నితత్వ పరిస్థితులకు కూడా అవమానమే'' అని శాంతి కార్యకర్త బాలరాజ్‌ పూరి ఒకప్పుడు వ్యాఖ్యానించారు.
 

/ వ్యాసకర్త - జమ్మూ కాశ్మీర్‌ మాజీ ఎమ్మెల్యే /

మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి

మహ్మద్‌ యూసుఫ్‌ తరిగామి