Aug 08,2023 22:45

కేంద్రమంత్రికి వినతిపత్రం అందజేస్తున్న ఎంపీ రామ్మోహన్‌ నాయుడు

* కేంద్రమంత్రికి ఎంపీ వినతి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జలశక్తి మిషన్‌ నిధులతో శ్రీకాకుళం జిల్లా ప్రజలకు తాగునీరందించాలని ఎంపీ కింజరాపు రామ్మోహన్‌ నాయుడు కోరారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్‌ షెకావత్‌తో మంగళవారం ప్రత్యేకంగా భేటీ అయి జిల్లా ప్రజలకు రక్షిత నీరు అందించాల్సిన ఆవశ్యకతను వివరించారు. జిల్లాలో 31 శాతం ఆవాసాలకే తాగునీరు సరఫరా అవుతోందని చెప్పారు. రక్షిత మంచినీరు అందకపోవడంతో, ప్రజలు అనారోగ్యం బారిన పడుతున్నారని తెలిపారు. జిల్లాలో దశాబ్ద కాలంలో వందలాది మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో మృత్యువాత పడడంతో పాటు వేలాది మంది వ్యాధుల బారిన పడి అవస్థలు పడుతున్నారని వివరించారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని జిల్లాలోని ప్రజలందరికీ సురక్షిత నీరు అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో జలశక్తి మిషన్‌ పథకం లక్ష్యం నీరుగారిపోతోందని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లారు. జల జీవన్‌ మిషన్‌ పథకానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రెండేళ్లుగా ఒక్క రూపాయి కూడా నిధులు వినియోగించుకోలేదనే విషయాన్ని ప్రస్తావించారు. ఈ ఏడాది కేవలం 5,069 కుళాయి కనెక్షన్లు మాత్రమే ఏర్పాటు చేశారని చెప్పారు. దీనిపై దృష్టిసారిస్తానని ఆయన ఎంపీతో చెప్పారు.