ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : కృష్ణానదిలో లాంచీల ప్రయాణానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. గుంటూరు జిల్లా రాయపూడి, కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం వరకు లాంచీల నిర్వహణకు జిల్లా ప్రజా పరిషత్ ఇటీవల నిర్వహించిన టెండర్లలో రూ.21.50 లక్షలతో అలపర్తి శ్రీరాం ప్రసాద్ టెండరు కైవసం చేసుకున్నారు. ఈ మేరకు త్వరలో లాంచీలను పునరుద్ధరిస్తామని శ్రీరాం ప్రసాద్ తెలిపారు.
ఆరేళ్ల క్రితం తూర్పు గోదావరి జిల్లా కచ్చలూరు వద్ద లాంచీ ప్రమాదం తరువాత నదుల్లో లాంచీల ప్రయాణాన్ని ప్రభుత్వం నిలిపేసింది. సుదీర్ఘకాలం తరువాత తిరిగి గతనెలలో అనుమతించడంతో లాంచీల నిర్వహణను పర్యవేక్షిస్తున్న జిల్లా పరిషత్ ఇందుకు సంబంధించి టెండర్లు పిలిచింది. రాయపూడి నుంచి ఇబ్రహీంపట్నంకు రోడ్డు మార్గంలో అయితే 50 కిలో మీటర్ల దూరం ఉంది. జలరవాణ మార్గంలో అయితే ఐదు కిలో మీటర్ల దూరంలో వెళ్లే అవకాశం ఉంది. 20 నిమిషాల్లో రాయపూడినుంచి ఇబ్రహీంపట్నం వెళ్లవచ్చునని నిర్వహాకులు చెబుతున్నారు. గతంలో లాంచీల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులు రవాణా చేసేవారు. వివిధ రకాల ఉత్పత్తుల రవాణాతో పాటు పర్యాటకులను, సాధారణ ప్రయాణికులను కూడా లాంచీల్లో చేరవేసేందుకు అవకాశం ఉంది. లాంచీల ద్వారా ప్రయాణంతో ప్రకృతి అందాలను కూడా వీక్షించవచ్చు. అయితే ఈ లాంచీలకు కొద్దికాలం మాత్రమే డిమాండ్ ఉంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం మంగళగిరి మండలం కాజ నుంచి ఏలూరు జిల్లా గుండుగొలను వరకు జాతీయ రహదారికి అనుసంధానంగా బైపాస్ నిర్మాణం జరుగుతోంది. ఇందులో భాగంగా తుళ్లూరు మండలం వెంకటపాలెం నుంచి విజయవాడకు సమీపంలోని గొల్లపూడి వరకు కృష్ణానదిపై వంతెన నిర్మాణం వేగంగా జరుగుతోంది. ఈ వంతెన నిర్మాణం పూర్తయితే ప్రతి ఒక్కరూ రోడ్డు మార్గంలో ఎన్‌టిఆర్ జిల్లాలోకి ప్రవేశించే అవకాశం ఉంది. ఇందువల్ల లాంచీలకు కొద్ది కాలమే డిమాండ్ ఉంటుందని అధికారులు చెబుతున్నారు.
రాజధాని అమరావతి ఏర్పడక ముందు ఈ ప్రాంతంతో మూడు పంటలు పండేవి. వీటిల్లో పూలు, పండ్లు, కాయలు ఎక్కువగా ఉత్పత్తి జరిగేది. ఈ నేపథ్యంలో వీటిని లాంచీల ద్వారా ఈ ఒడ్డు నుంచి ఆ ఒడ్డుకు చేర్చేవారు. కొంత కాలంగా లాంచీలు లేకపోవడం, రాజధాని గ్రామాల్లో భూములన్నీ సిఆర్‌డిఎ తీసుకోవడం వల్ల వ్వవసాయ కార్యకలాపాలు ఆగిపోయాయి. కృష్ణానదిలో జలరవాణాకు 100 ఏళ్ల చరిత్ర ఉందని, స్వాతంత్య్రం రాక ముందు గతంలో నాటుపడవలు ఎక్కువగా వినియోగించే వారని, అప్పట్లో నదీ ఉధృతి అంతగా లేదని రాయపూడి వాసులు గుర్తు చేసుకుంటున్నారు. ప్రస్తుతం నదీ ప్రవాహ ఉధృతిని బట్టి అధికారులు ఎప్పటికప్పుడు ఇచ్చే సూచనల మేరకు లాంచీలను నడుపుతామని కాంట్రాక్టరు శ్రీరాం ప్రసాద్ తెలిపారు. డ్రైవర్లకు బీమా చేశామని, ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు తెలిపారు.










