ప్రజాశక్తి-అనంతగిరి:
జలపాతాలకు వచ్చే పర్యటకులు అప్రమత్తంగా ఉండాలని అనంతగిరి ఎస్సై కరక రాము సూచించారు. మండలంలో కాశీపట్నం, గోస్తిని నదీ పరివాహక ప్రాంతంలో పర్యటకులు స్నానాలు చేస్తున్న ప్రదేశాలలో బుధవారం హెచ్చరిక బోర్డులను కో ఆప్షన్ సభ్యుడు మదీనాతో కలిసి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విహారం కోసం వచ్చే పర్యాటకులు విషాదంతో తిరిగి ఇళ్లకు వెళ్లకుండా ఉండాలంటే జలపాతాల వద్ద అప్రమత్తంగా జాగ్రత్తగా వ్యవహరించాలన్నారు. అనంతగిరి పంచాయతీలో తాడిగుడ, ఎగువశోభ, మర్దగుడ, కటికి, పెదబయలు, చిటంపాడు జలపాతాలకు వచ్చే పర్యాటకులు స్థానికుల హెచ్చరికలు పాటించాలని సూచించారు. అతిగా ప్రవర్తించి ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దని సూచించారు.గోస్తని వద్ద రోజుకు ఒక వాలంటీర్‌ను, వారాంతపు రోజుల్లో ఒక హౌంగార్డును సైతం ప్రమాదాలు జరగకుండా అందుబాటులో ఉంచుతున్నట్లు ఆయన చెప్పారు.










