Jul 30,2023 22:33

కోటబొమ్మాళి మండలం ఊడికలపాడులో ట్రాన్స్‌ఫార్మర్‌ వేసి కనెక్షన్‌ ఇవ్వని అధికారులు

- బోర్ల కోసం 5,714 మంది దరఖాస్తు
- ఇప్పటివరకు 246 చోట్లే తవ్వకాలు
- 13 మంది రైతులకే విద్యుత్‌ కనెక్షన్లు
- మూడేళ్లుగా రైతుల ఎదురుచూపులు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
జిల్లాలో సాగునీటి సౌకర్యం లేక వేలాది ఎకరాల భూములు నిరుపయోగంగానే ఉన్నాయి. ఆ భూముల్లో ఉచితంగా బోర్లు వేసి వాటిని వినియోగంలో తీసుకొస్తామంటూ వైసిపి ప్రభుత్వం రెండున్నరేళ్ల కిందట వైఎస్సార్‌ జలకళ పథకాన్ని తీసుకొచ్చింది. బోర్లతో పాటు విద్యుత్‌ కనెక్షన్‌ అందిస్తామని చెప్పడంతో రైతులు ఉత్సాహంగా దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల స్వీకరణ, సర్వే పూర్తి చేసి అర్హులైన వారికి అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పుడిప్పుడే ఊపందుకుంటున్న తరుణంలో ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో అన్నదాతల ఉత్సాహంపై నీళ్లు చల్లినట్లయింది. విద్యుత్‌ కనెక్షన్ల ఖర్చు నిర్ణీత మొత్తం కంటే దాటితే రైతులే భరించాలని ప్రభుత్వం చెప్పడంతో రైతులు ఉసూరుమంటున్నారు.
చిన్న, సన్నకారు రైతులకు మేలు కలిగించేందుకు వైసిపి ప్రభుత్వం సెప్టెంబర్‌ 28, 2020లో ప్రారంభించింది. బోరు సౌకర్యం లేని 2.5 ఎకరాల నుంచి ఐదు ఎకరాల వరకు ఉన్న రైతులను అర్హులుగా పేర్కొంది. బోర్ల తవ్వకం, విద్యుత్‌ కనెక్షన్లను ఉచితంగా ఇస్తామంటూ ప్రకటించింది. ప్రస్తుతం అందులో మార్పులు చేయడంతో అన్నదాతలు ఉసూరుమంటున్నారు. ఐదెకరాల్లోపు వారికి సైతం రూ.రెండు లక్షల్లోపు మాత్రమే విద్యుత్‌ కనెక్షన్ల ఖర్చు చేస్తామని అంతకంటే ఎక్కువైతే, రైతులే భరించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇప్పటివరకు వేసిన వాటికి యధాతథంగా డబ్బులు చెల్లించనున్నట్లు తెలిసింది. ఇకపై కనెక్షన్లకు రైతులే చెల్లించాల్సి ఉంటుందని తెలుస్తోంది. దీంతో ఇన్నాళ్లు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు వస్తాయని ఎదురుచూస్తున్న రైతులకు షాక్‌ ఇచ్చినట్లయింది. దరఖాస్తుదారుల్లో ఐదు ఎకరాల్లోపు ఉన్న వారే ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వం ముందుగా ప్రకటించిన ప్రకారమైతే వీరందరికీ ఉచితంగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంటుంది. రాయితీని రూ.రెండు లక్షలకే పరిమితం చేయడంతో, వందల సంఖ్యలోనే రైతులు అర్హత సాధించే పరిస్థితి నెలకొంది.
13 చోట్లే విద్యుత్‌ కనెక్షన్లు
జిల్లాలో వైఎస్సార్‌ జలకళ పథకం కోసం మొత్తం 5,714 దరఖాస్తులు వచ్చాయి. వాటిలో 4,690 దరఖాస్తులు అర్హమైనవిగా తేల్చారు. వాటిలో 2,299 చోట్ల సర్వే పూర్తి చేశారు. సర్వే పూర్తయిన వాటిలో 1057 ప్రాంతాల్లో బోర్ల తవ్వకాలకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. ఇప్పటివరకు 246 చోట్ల బోర్లు తవ్వారు. 229 ప్రాంతాల్లో నీళ్లు పడగా 17 చోట్ల నీరు పడలేదు. 13 మంది రైతుల పొలాలకు విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు.
వేల సంఖ్యలో దరఖాస్తులు... పదుల్లో తవ్వకాలు
చిన్న, సన్నకారు రైతులను ఆదుకునేందుకు గతంలో ఇందిర జలప్రభ, ఎన్‌టిఆర్‌ జలసిరి పేర్లతో ప్రభుత్వాలు అమలు చేశాయి. వైసిపి అధికారంలోకి వచ్చిన తర్వాత కొన్ని మార్పులు చేసి వైఎస్సార్‌ జలకళగా పేరు మార్చింది. బోర్లు, విద్యుత్‌ కనెక్షన్లు ఉచితంగా ఇస్తామని ప్రకటించడంతో రైతులు ఆశతో దరఖాస్తు చేసుకున్నారు. ప్రారంభం నుంచి పలు నిబంధనలు మార్చడం, గిట్టుబాటు కాక డ్రిల్లింగ్‌ ఏజెన్సీలు ముందుకు రాకపోవడం, నిధులలేమి, బిల్లుల చెల్లింపుల్లో జాప్యం తదితర కారణాలతో పురోగతి కనిపించడం లేదు. జిల్లాలో ఎచ్చెర్ల, ఆమదాలవలస, పలాస నియోజకవర్గాల్లో మాత్రమే బోర్ల తవ్వకాలకు డ్రిల్లింగ్‌ ఏజెన్సీలు ముందుకు వచ్చాయి. ప్రభుత్వం చెల్లిస్తున్న ధర గిట్టుబాటు కావడం లేదంటూ మిగిలిన నియోజకవర్గాల్లో ఏజెన్సీలు ఆసక్తి చూపడం లేదు. వేల మంది రైతులు దరఖాస్తు చేసుకుంటే, ఈ రెండేళ్లలో వందల సంఖ్యలోనే బోర్లు తవ్వారు. పదుల సంఖ్యలోనే విద్యుత్‌ కనెక్షన్లు ఇచ్చారు.
అర్ధాంతరంగా ఆపేశారు
కొందరి పొలాల్లో బోర్లు తవ్వినా మోటార్లు ఇవ్వలేదు. విద్యుత్‌ సరఫరా చేసేందుకు అధికారులు ట్రాన్స్‌ఫార్మర్‌ ఏర్పాటు చేసినా, ఇప్పటివరకు కనెక్షన్‌ ఇవ్వలేదు. నీళ్లు ఉంటే రెండో పంటగా కూరగాయలను సాగు చేయాలనుకున్నా, ప్రస్తుతం మోటారు లేకపోవడం పొలాన్ని అలానే వదిలేశారు. మరికొన్నిచోట్ల పొలాల్లో ట్రాన్స్‌ఫార్మర్లు ఏర్పాటు చేసినా విద్యుత్‌ కనెక్షన్లు ఇవ్వలేదు. ఐదెకరాల్లోపు ఉన్న రైతులకు రూ.రెండు లక్షల వరకు విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, ఆ తర్వాత ఎక్కడా ఒక్క కనెక్షన్‌ ఇవ్వలేదు. కొన్ని చోట్ల విద్యుత్‌శాఖ కనెక్షన్లు ఇచ్చినా వాటికయినా ఖర్చునూ ప్రభుత్వం చెల్లించలేదని తెలుస్తోంది. ప్రభుత్వం విద్యుత్‌శాఖకు డబ్బులు ఇవ్వకపోవడంతో విద్యుత్‌శాఖ కనెక్షన్లను ఆపేసింది. దీంతో బోర్లు తవ్వి విడిచిపెట్టేయంతో మట్టి కూరుకుపోతోందని, త్వరగా తమకు విద్యుత్‌ సరఫరా అయ్యేలా చూడాలని రైతులు కోరుతున్నారు.