Feb 16,2023 21:31

ప్రజాశక్తి - భీమడోలు
          వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించొద్దని, జలకళ బోర్లకు ఇచ్చే విద్యుత్‌ కనెక్షన్‌ ఖర్చును ప్రభుత్వమే భరించాలని ఎపి రైతు సంఘం కోరింది. ఈ మేరకు గురువారం ట్రాన్స్‌కో ఎఇ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. దీనిలో భాగంగా వ్యవసాయ మోటార్లకు మీటర్లు బిగించొద్దంటూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్‌ మాట్లాడుతూ వ్యవసాయ ఉచిత విద్యుత్‌ పథకాన్ని యథావిధిగా కొనసాగించాలని కోరారు. విద్యుత్‌ చట్ట సవరణ బిల్లు రైతులకు, విద్యుత్‌ ఉద్యోగులకు నష్టదాయకమన్నారు. ప్రభుత్వరంగ సంస్థల ప్రయివేటీకరణ ఆపాలని కోరారు. నగదు బదిలీ పథకాన్ని మోసపూరితంగా పేర్కొన్నారు. ఉచిత విద్యుత్‌ పథకానికి దీన్ని అమలు చేయొద్దని కోరారు. ఈ కార్యక్రమంలో ఎపి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కట్టా భాస్కరరావు, గుర్రం రాంబాబు, గుర్రం పాపారావు పాల్గొన్నారు.