Sep 21,2023 20:42

నీటి ట్యాంకుకు భూమి పూజ చేస్తున్న ఎంపిపి, సర్పంచి

ప్రజాశక్తి - గోనెగండ్ల
గత దశాబ్దాల కాలంగా వేసవి వస్తే తాగునీటి కోసం ప్రజలు పడే కష్టాలు ఇక నుంచి ఉండదని ఎంపిపి నసురుద్దీన్‌, సర్పంచి హైమావతి తెలిపారు. గురువారం దాదాపు రూ.2.50 కోట్ల నిధులతో జలజీవన్‌ మిషన్‌ పథకం కింద గోనెగండ్లలోని చింతలముని దేవాలయం సమీపంలో నూతన నీటి ట్యాంకు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. గోనెగండ్లలో ప్రజలు తాగు నీటి కోసం వేసవిలో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. ఇకపై ప్రజలకు జలజీవన మిషన్‌ పథకం ద్వారా ఇంటింటికీ ఉచిత కుళాయి ఇచ్చి నీటి కష్టాలు తొలగిస్తామని చెప్పారు. గోనెగండ్ల మేజర్‌ పంచాయతీలో శివాలయం వద్ద 1, చింతలముని స్వామి దేవాలయం దగ్గర 1, రజక వీధిలో 1 మొత్తం 3 ఓవర్‌ హెడ్‌ ట్యాంకులు, స్థానిక ఎస్‌ఎస్‌ ట్యాంకు వద్ద రెండు అదనపు ఫిల్టర్‌ బెడ్లు నిర్మించనున్నామని అన్నారు. మాజీ కో ఆప్షన్‌ సభ్యులు టి.బందే నవాజ్‌, అడ్వకేట్‌ చంద్రశేఖర్‌, కటికే మాబువలీ, నద్దిముల్లా, ఖాజా పటేల్‌, కౌలుట్లయ్య, ఓబులయ్య, మదీనా, ఆర్‌డబ్ల్యుఎస్‌ ఎఇ శ్రీనివాస రెడ్డి, జూనియర్‌ అసిస్టెంట్‌ సతీష్‌ కుమార్‌ పాల్గొన్నారు.