Aug 13,2023 22:04

గ్రామంలోకి వెళుతున్న ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ ప్రయివేటు ట్యాంక్‌

ప్రజాశక్తి - చిలమత్తూరు: జల్‌ జీవన్‌ మిషన్‌ కార్యక్రమం కింద ప్రతి ఇంటికి ఉచిత కొళాయి పేరిట చేపడుతున్న కార్యక్రమం నత్తనడకన సాగుతోంది. చిలమత్తూరు మండల వ్యాప్తంగా 12 గ్రామపంచాయతీల్లో 84 గ్రామాలు ఉన్నాయి. వీటిలో కేవలం 9 గ్రామపంచాయతీలో జల జీవన్‌ మిషన్‌ కార్యక్రమం మొదలు పెట్టినా మండల వ్యాప్తంగా కేవలం 17 గ్రామాలలో మాత్రమే ఈ కార్యక్రమం చేపట్టారు. వీటిలోను పంచాయతీ బోర్లకు చెందిన పైప్‌లైన్లకు కొళాయిలు ఏర్పాటు చేసి ఇదే జలజీవన్‌ మిషన్‌ అని చెబుతున్న పరిస్థితి నెలకొంది. 84 గ్రామాలలో కేవలం 17 గ్రామలలో మాత్రమే జెజెం పనులు చేపడుతున్నట్లు ఆర్‌డబ్ల్యూఎస్‌ ఏఈ వేణు తెలిపారు. ఇక 67 గ్రామాలలో అసలు జలజీవన్‌ మిషన్‌ పనులు ప్రారంభం కాలేదు. ఈ ఏడాది వర్షాభావం కారణంగా భూగర్బజలాల ఇంకిపోతున్న పరిస్థితులు తలెత్తుతున్నాయి. ఈ నేపధ్యంలో మరోసారి మండలంలో తాగునీటి కష్టాలు మొదలు కానున్నట్లు సంకేతాలు అందుతున్నాయి.2019లో జలజీవన్‌ మిషన్‌ ప్రారంభం అయింది. 2024 నాటికి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి ఉచిత కొళాయి ఏర్పాటు చేయడం జలజీవన్‌ మిషన్‌ లక్ష్యం అయితే 2023 సంవత్సరం ముగింపుదశకు వస్తున్నా మండలంలో కేవలం 20 శాతం గ్రామాలలో కూడా ఈ పనులు పూర్తికాకపోవడం అధికారుల చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.
మూడు పంచాయతీల్లో కన్పించని జలజీవన్‌ జాడ
మండల పరిధిలోని శెట్టిపల్లి,పలగలపల్లి,సోమఘట్ట గ్రామ పంచాయతీలలో కేవలం ఒక్కటంటే ఒక్క గ్రామంలో కూడా జలజీవన్‌ మిషన్‌ ద్వారా కొళాయిలు ఏర్పాటు చేయలేదు. ప్రధానంగా ఈ మూడు పంచాయతీలు మారుమూల ప్రాంతాలుగా ఉన్నాయి. ఈ పంచాయతీలలో ఇంటికొళాయిలు కాదు కదా కనీసం వీధి కొళాయిలు కూడా సక్రమంగా లేవు కాని ఆ పంచాయతీల్లో జలజీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీకొళాయిలు ఏర్పాటు చేయవల్సిన అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు పంచాయతీ ఏర్పాటు చేసిన ట్యాంక్‌ ల వద్ద గంటల తరబడి నీటి కోసం ఎదురు చూస్తున్నారు. మరికొన్ని చోట్ల సుదీర ప్రాంతంలో ఉన్న వ్యవసాయబోర్లు నుండి నీరు తెచ్చుకుంటున్న పరిస్థితి ఉంది.
పంచాయతీలపైనే అధికభారం
పేరుకు జలజీవన్‌ మిషన్‌ అయినా ఆయా గ్రామాల్లో ఇంటి కొళాయిలు మొత్తం గతంలో పంచాయతీ ద్వార ఏర్పాటు చేసిన పైప్‌లైన్లకే అమర్చారు. దీని కారణంగా తర్వాత కాలంలో వచ్చే చిన్న చిన్న రిపేరీలు మొదలు కాలంచెల్లిన కొళాయిలు, మోటర్‌ నిర్వహణ మొత్తం పంచాయతీలకు భారంగా మారనుంది. గతంలో పంచాయతీలకు డిపాజిట్‌ చెల్లించేవారు కొళాయి పన్ను చెల్లించేవారు. ఇపుడు ఇవేమి చెల్లించకపోవడంతో పంచాయతీ లకు తలకుమించిన భారంగా మారుతోంది.
వాటర్‌ ప్లాంట్‌ నిర్వాహకులకు అధికారుల పరోక్ష సహకారం
మండలంలో ఫ్యూరిఫైడ్‌ వాటర్‌ పేరిట నీటి వ్యాపారం ఊపందుకుంది. గ్రామాల్లో పంచాయతీలు తాగునీటిని అందించడంలో విఫలం కావడం, ఇక జలజీవన్‌ మిషన్‌ ద్వార ఇంటి వద్దకే నీటిని అందించే పక్రియ కన్పించకపోవడం కారణంగా ప్రయివేటు వాటర్‌ ప్లాంట్లు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ఈ వాటర్‌ప్లాంట్ల నిర్వాహకులకు అధికారులు పరోక్ష సహకారం అందిస్తున్నట్లు కన్పిస్తోంది. ఈ నేపధ్యంలో మండలంలో జలజీవన్‌మిషన్‌ ఎప్పటికి అమలు అవుతుందోనని మండల ప్రజలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.
అంతులేని నిర్లక్ష్యం
జలజీవన్‌ మిషన్‌ ప్రారంభం కాని ప్రాంతాలలో గుత్తేదారులు ముందుకు రావడం లేదని అధికారులు చెబుతున్న మాట. నిజానికి చేసిన పనులకు బిల్లులు అందకపోతే గుత్తేదారులు ముందుకు రారు. కాని బిల్లులు మంజూరు అవుతున్నాయి. అయినప్పటికి గ్రామ పంచాయతీల్లో తీర్మానం చేయించడం పనులు అప్పగించడం ,అప్పగించిన పనులను పర్యవేక్షణ చేయకపోవడం వంటి లోపాలతో పాటు ఎంబుక్‌ చేయకుండా సతాయించడం వంటి కార్యకలాపాల వల్ల ఈ కార్యక్రమం నత్తనడక నడుస్తున్నట్లు సమాచారం. ఇప్పటికైన ఉన్నత స్థాయి అధికారులు దృష్టి సారించి జలజీవన్‌ మిషన్‌ ద్వార ఇంటింటింకి ఉచిత కొళాయి కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరుతున్నారు.