Oct 16,2023 23:27

మాట్లాడుతున్న కలెక్టర్‌ వేణుగోపాల్‌రెడ్డి

గుంటూరు: జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుకు మంజూరు చేసిన పనులు వేగవంతంగా చేసి ,నిర్దేశిత సమయంలో పూర్తయ్యేలా గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖ ఇంజినీర్లు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి ఆదేశించారు.సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్‌ ఎం.వేణుగోపాల్‌రెడ్డి జల్‌జీవన్‌ మిషన్‌, గడపగడపకు మన ప్రభుత్వంలో మంజూరు చేసిన పనుల పురోగతిపై గ్రామీణ నీటిసరఫరా, పారిశుద్ధ్య శాఖ ఇంజినీర్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జల్‌జీవన్‌ మిషన్‌ ద్వారా గ్రామాల్లో మంజూరు చేసిన పనులలో నిర్దేశించిన ప్రకారం ఇంటింటికీ కుళాయిల ఏర్పాటుతోపాటు ఓవర్‌ హెడ్‌ ట్యాంక్‌ల నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి అయ్యేలా చూడాలన్నారు. పేదలందరికీ ఇళ్ళ పథకం లే అవుట్‌లో నిర్మాణం పూర్తి అయిన ఇళ్ళకు జెజెఎంలో వెం టనే కుళాయి కనెక్షన్లు ఏర్పాటు చేయాలన్నారు. సచి వాల యాల్లోని ఇంజినీరింగ్‌ అసిస్టెంట్‌లను సమన్వయం చేసుకుంటూ పనుల పర్యవేక్షించాలని చెప్పారు. ఇప్పటికి పెండింగ్‌లో ఉన్న పనులకు టెండర్లు ప్రక్రియను వెంటనే పూర్తి చేసి పనులు ప్రారంభించేందుకు చర్యలు తీసు కోవాలన్నారు. గడప గడపకు మన ప్రభుత్వంలో మంజూరు చేసిన పనులు వెంటనే పూర్తి అయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో సరఫరా అవుతున్న త్రాగు నీటికి నిర్వహిస్తున్న పరీక్షలలో కలుషిత నీటిని గుర్తించితే వెంటనే అక్కడ ప్రత్యమ్నాయంగా తాగు నీరు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తాగునీటికి ఇబ్బంది లేకుండా ప్రస్తుతం నాగార్జున సాగర్‌ కెనాల్‌ నుంచి విడుదల చేసిన నీటితో గ్రామల్లో చెరువులు నింపేలా ఆర్‌ డబ్ల్యు ఎస్‌ ఇంజినీరింగ్‌ అధికారులు, ఇరిగేషన్‌ ఇంజినీర్లు, రెవెన్యూ అధికారులు సమన్వయంతో చర్యలు తీసుకోవాలన్నారు. సమావేశంలో ఆర్‌డబ్ల్యూఎస్‌ ఎస్‌ఈ సురేష్‌, ఈఈ త్రినాధ్‌ బాబు తదితరులు పాల్గొన్నారు.