Oct 25,2023 20:57

సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

ప్రజాశక్తి-విజయనగరం :  జలజీవన్‌ మిషన్‌ పనులను త్వరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి ఆదేశించారు. జెజెఎం, జిజిఎంపి ఇతర అభివృద్ధి పనులపై గ్రామీణ నీటి సరఫరా ఇంజనీర్లతో బుధవారం కలెక్టరేట్‌లో సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో వివిధ మండలాల్లో జరిగిన జెజెఎం పనుల పురోగతిని ఆ శాఖ సూపరింటెండెంట్‌ ఇంజినీర్‌ బి.ఉమాశంకర్‌ వివరించారు. కాంట్రాక్టర్ల సమస్యలను తెలుసు కున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ, జెజెఎం పనులను త్వరగా పూర్తి చేసి, ప్రతి ఇంటికీ సురక్షిత తాగునీటిని సరఫరా చేయాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా పనులు పూర్తి చేయాలన్నారు. ఇంకా టెండర్లు ఖరారు కానిచోట, త్వరగా ఆ ప్రక్రియను పూర్తి చేయాలన్నారు. యుద్దప్రాతిపదిక పనులను పూర్తి చేసి, శతశాతం ఇళ్లకు తాగునీరు అందించే విధంగా కార్యాచరణను అమలు చేయాలని ఆదేశించారు. గడప గడపకు మన ప్రభుత్వం కింద పనులను పూర్తిచేసిన వెంటనే బిల్లులు అప్‌లోడ్‌ చేయాలని సూచించారు. జగనన్న కాలనీల్లో 50 శాతం ఇళ్ల నిర్మాణం పూర్తి అయినచోట, తక్షణమే తాగునీటి సరఫరా చేయాలని, దీనికి వెంటనే చర్యలు ప్రారంభించాలని చెప్పారు. సమావేశంలో అసిస్టెంట్‌ కలెక్టర్‌ వెంకట త్రివినాగ్‌, ఆర్‌డబ్ల్యూఎస్‌ ఇఇ విద్యాసుందర రాజన్‌, డిఇలు, కాంట్రాక్టర్లు పాల్గొన్నారు.