కాంట్రాక్టర్‌కు ఐదుకు మించి పనులు అప్పగించొద్దు
జిల్లా కలెక్టర్ సుమిత్‌కుమార్
ప్రజాశక్తి -పాడేరు : జలజీవన్ మిషన్ కింద చేపట్టిన పనులు త్వరితగతిన పూర్తి చేసి గిరిజనులకు రక్షిత మంచినీటి సదుపాయం కల్పించాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ చాంబర్‌లో పాడేరు డివిజన్ జలజీవన్ మిషన్ అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 56 కింద మంజూరైన 8789 పనులలో 1550 పనులు పూర్తి కాగా మిగిలిన పనుల ప్రగతిపై కలెక్టర్ ఆరా తీసారు. మండలాల వారీగా నిర్వహించిన సమీక్షలో పాడేరు సహాయ ఇంజనీర్ సరైన వివరాలతో హాజరు కాకపోవటంపై కలెక్టర్ అసహనం వ్యక్తం చేశారు. 15 రోజులకు ఒకసారి నిర్వహించే సమావేశానికి కూడా పూర్తి వివరాలు తీసుకు రాకపోతే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. తదుపరి సమావేశానికి పూర్తి వివరాలతో హాజరు కావాలని ఆదేశించారు. పనుల నాణ్యత సరిగా లేకుంటే కాంట్రాక్టర్ నుండి రికవరీ చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 818, 235 పనులు ప్రగతిలో ఉండగా మరో 1079 పనులకు టెండర్లు పిలవగా 800 వరకు టెండర్లు ఖరారయ్యాయన్నారు. ఒక్కో కాంట్రాక్టర్‌కు ఐదు పనులకు మించి అప్పగించవద్దని కలెక్టర్ ఆదేశించారు. అప్పగించిన పనులు పూర్తి చేసాక మాత్రమే కొత్త పనులు అప్పగించాలన్నారు.ఎక్కువ పనులను అప్పగించడం వల్ల పనుల పురోగతి, వేగవంతం, నాణ్యతపై కాంట్రాక్టర్లు శ్రద్ధ పెట్టక జాప్యం జరుగుతోందన్నారు. . ప్రభుత్వ ఉత్తర్వులు సంఖ్య 8789 కింద ఇటీవల మంజూరైన పనులకు మండలాల వారీగా నివేదికలు తయారు చేసి సమర్పించాలన్నారు. రూ. ఐదు లక్షలకు మించి విలువైన పనులను సంబంధిత సాంకేతిక సిబ్బందితో టెలికాన్ఫరెన్స్ నిర్వహించి ఇఇ ఖరారు చేయాలని, ప్రతి విషయం డిఇఇ, ఇఇల దష్టిలో ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. ఇటీవల కలెక్టర్ జామిగూడ పర్యటనలో 14 గ్రామాలకు సంబంధించి రూ.56 లక్షలతో చేపట్టిన మంచి నీటి పధకం పనులను ముగ్గురు కాంట్రాక్టర్లకు అప్పగించాలని చెప్పిన విషయం గుర్తు చేస్తూ, వాటి ప్రగతి పై ఆరా తీసారు. సమావేశంలో జలజీవన్ మిషన్ ఇఇ లీలాక్రిష్ణ, డిఇఇలు గోపాలకృష్ణ, జయరాం, ఆర్. రాజు, ప్రకాష్, మండల సహాయ ఇంజినీర్లు పాల్గొన్నారు.










