ప్రజాశక్తి -ముంచింగిపుట్టు: మండలంలోని కిలగాడ గ్రామపంచాయతీ పరిధిలోగల పడాలపుట్టు, కొత్తుల బయలు గ్రామాలలో జలజీవన్ మిషన్ నిధులతో బోర్లు తవ్వే పనులకు స్థానిక సర్పంచ్ శివశంకర్ ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పడాలపుట్టు, కొత్తులబయలు గ్రామాల్లో చెరో రూ..10.80 లక్షలతో మొత్తంగా రూ. 21.60లక్షలను వెచ్చించి, తాగునీటి సమస్యను అధిగమించేందుకు పెద్ద ట్యాంకులను నిర్మించి, వాటి ద్వారా ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందజేస్తామన్నారు. ఏటా తాగునీరు లేక అల్లాడుతున్న గిరిజనులకు జలజీవన్ మిషన్ నిధులతో రెండు గ్రామాల్లోనూ బోరుబావులు ఏర్పాటుపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలోని మిగిలిన గ్రామాల్లోనూ తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకొని జలజీవన్ మిషన్ నిధులు మంజూరుకు కృషి చేస్తానన్నారు.
గడచిన మూడేళ్లుగా పంచాయతీలకు నిధులు లేని పరిస్థితుల్లో గ్రామాల్లోని తాగునీరు, ఇతరత్రా సమస్యలను పరిష్కరించలేని దుస్థితిలో ఉన్న పంచాయతీలకు మండల సర్వసభ్యసమావేశాల్లో సమస్యను ప్రస్తావించగా, ఎంపిపి చొరవతో ఎంపిడిఒ నివేదికలను ఉన్నతాధికారులకు పంపడంతో ఈ మేరకు జలజీవన్ మిషన్ నిధులు మంజూరై, తాగునీటి సమస్య పరిష్కారమౌతోందని సర్పంచ్ శివశంకర్ వెల్లడించారు. కార్యక్రమంలో పంచాయతీ వార్డు సభ్యుడు మట్టం కిరణ్ ాకూమార్, మాజీ ఎంపిటిసి ఉబ్బన్న, గ్రామ పెద్దలు, చందు, మత్యరాజు, రాంబాబు, తిరుపతి, కామేష్, క్రిష్ణమూర్తి, త్రినాధరావు పాల్గొన్నారు.










