
రాయచోటి : జిల్లాలోని చెరువులలో నీటిని కలుషితం కాకుండా పొదుపు చేసుకుంటూ జల వనరులను కాపాడు కోవడమే తమ లక్ష్యమని జిల్లా జలవనరుల అధికారి బి. కష్ణమూర్తి పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాలో రైతులు నీటిని ఎలా పొదుపు చేసుకుని చెరువుల కింద పంటలను ఎలా సాగు చేసుకోవాలో ప్రజాశక్తికి ఇచ్చిన ముఖాముఖిలో ఆయన వివరించారు.
అన్నమయ్య జిల్లాలో జలవనరుల కార్యాలయాల వివరాలు తెలపండి?
అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా డివిజన్ కార్యాలయాలు మదనపల్లె, కడప, కదిరి ప్రాంతాలలో ఉన్నాయి. సబ్ డివిజన్ కార్యాలయాలు రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, గాలివీడు, మదనపల్లి, తంబళ్లపల్లి, వాల్మీకపురం, రాజంపేట, రైల్వే కోడూరు ప్రాంతాల్లో ఉన్నాయి.
జల వనరుల కార్యాలయం పని వివరాలు తెలపండి?
జిల్లావ్యాప్తంగా జలవనరుల అధికారులు రైతులకు అందుబాటులో ఉండి చెరువులను పునరుద్దించడం, రిజర్వాయర్‌లకు అవసరమైన మరమ్మతులు చేపట్టడం, తెగిపోయిన చెరువులను పునరుద్ధరించడం మొదలగు పనులు చేపడతాం.
జిల్లాలో ఎన్ని రిజర్వాయర్‌లున్నాయి?
జిల్లా వ్యాప్తంగా మేజర్ రిజర్వాయర్లు చిన్నమండం మండలంలో శ్రీనివాసపురం రిజర్వాయర్, మీడియం రిజర్వాయర్లు రాజంపేట మండలం అన్నమయ్య ప్రాజెక్టు, గాలివీడు మండలం వెలుగెళ్లు బ్యాలెన్సింగ్ రిజర్వా యలున్నాయి. మైనర్ రిజర్వాయర్లు నిమ్మనపల్లి మండలం బహుదా, తంబళ్లపల్లె మండలం పెద్దూరు రిజర్వాయార్, సంబేపల్లి మండలం జరికోన రిజర్వాయర్, టి సుండుపల్లి మండలం పింఛా రిజర్వాయర్లున్నాయి.
జిల్లావ్యాప్తంగా ఎన్ని చెరువులు ఉన్నాయి?
జిల్లా వ్యాప్తంగా 3,272 చెరువులు, ఆయకట్టు 1,00,073 ఎకరాలున్నాయి.. 100 ఎకరాల పైబడి ఆయకట్టు కలిగిన 154 చెరువులు, ఆయకట్టు 53407 ఎకరాలు ఉన్నాయి. 100 ఎకరాల లోపు ఆయకట్టు చెరువులు 3118, ఆయకట్టు 46666 ఎకరాలు ఉన్నాయి.
గతంలో తెగిన ప్రాజెక్టుకు మరమ్మతులు చేపడుతున్నారా?
2021 సంవత్సరం నవంబర్‌లో అతిభారీ వర్షాలకు అన్నమయ్య ప్రాజెక్టు, పింఛా ప్రాజెక్టులు తెగిపోయాయి. అన్నమయ్య ప్రాజెక్టు పునర్మాణానికి రూ. 787,77 కోట్లు, పింఛా ప్రాజెక్ట్ పునర్నిర్మాణానికి 84.33 కోట్ల బడ్జెట్ మంజూరైంది .పనులు కూడా పురోగతిలో ఉన్నాయి. అన్నమయ్య ప్రాజెక్టుకు పునరుద్ధరణకు రూ. 787.77 కోట్లకు అనుమతులు వచ్చినవి టెండర్ ప్రక్రియ పూర్తయింది. త్వరలో పనులు ప్రారంభిస్తాం. తెగిపోయిన చెరువులకు అంచనాల తయారు చేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాం. రాగానే పనులు ప్రారంభిస్తాం.
జిల్లాలో లిఫ్టు స్కీములు ఏమైనా మంజూరయ్యాయా?
జిల్లాలో ఐదు లిఫ్టు స్కీమ్‌లు మంజూరయ్యాయి. గాలివీడు మండలంలో వెలిగల్లు లిఫ్ట్ స్కీమ్‌కు రూ.94.56 కోట్లతో అనుమతులొచ్చాయి. జరికోన లిఫ్ట్ స్కీంకు రూ.42.25 కోట్లకు అనుమతులొచ్చాయి. రామాపురం లిఫ్ట్ స్కీమ్‌కు రూ.29.38 అనుమతులొచ్చాయి. జిఎన్‌ఎస్‌ఎస్ నుంచి హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు అనుసంధానం లిఫ్ట్ స్కీముకు రూ. 5036.00 కోట్లకు అనుమతులొచ్చాయి.
రైతులకు ఏమైనా సలహాలు ఇవ్వాలనుకుంటున్నారా?
ఈ ఏడాదిలో ఇప్పటి వరకు వర్షపాతం తక్కువగా నమోదైంది. రిజర్వాయర్లు, చెరువులలో నీటి లభ్యత తక్కువగా ఉంది. ఇలాంటి పరిస్థితులలో రైతులు నీటిని హేతుబద్ధంగా తక్కువగా వాడుకవాలి. తక్కువ నీటితో ఎక్కువ పంట రాబడి వచ్చే పంటలు సాగు చేసుకోవాలి. వరికి బదులు తణధాన్యాలు వంటివి సాగు చేసుకుని నీటిని పొదుపు చేసుకోవాలి.