Apr 16,2023 21:55

మెట్ట ప్రాంత రైతులకు ప్రభుత్వం ఝలక్‌
అక్కరకు రాని వైఎస్‌ఆర్‌ జలకళ
బోర్లు వేయరు.. వేసిన బోర్లకు డబ్బులివ్వరు
పెండింగులో రూ.30 కోట్లు బకాయిలు
నిర్ధేశిత లక్ష్యానికి.. కార్యాచరణకు పొంతన కరువు
ప్రజాశక్తి - ఏలూరు ప్రతినిధి

వైఎస్‌ఆర్‌ జలకళ పథకం రైతులకు అక్కరకు రావడం లేదు. ప్రభుత్వం ప్రకటనలకు,, క్షేత్రస్థాయిలో కార్యాచరణకు ఏమాత్రం పొంతన లేకుండాపోయింది. ఇటీవల జరిగిన డిఆర్‌సి (జిల్లా సమీక్షా కమిటీ) సమావేశంలో ఎంఎల్‌ఎలు అంతా జలకళ పథకం అమలు తీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేయడమే దీనికి నిదర్శనం. ఈ పథకంలో బోర్లు వేసే కాంట్రాక్టర్లు ఎవరో కూడా ఎంఎల్‌ఎలకే తెలియని పరిస్థితి ఉంది. 2020 సెప్టెంబర్‌లో వైఎస్‌ఆర్‌ జలకళ పథకానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. దాదాపు మూడేళ్లు కావొస్తోంది. ఇప్పటి వరకూ జిల్లాలో నిర్ధేశించుకున్న లక్ష్యానికి.. జరిగిన పనికి ఏమాత్రం సంబంధం లేకుండా పోయింది. జిల్లాలో మొత్తం 3,705 బోర్లు జలకళ పథకం ద్వారా వేయాలని నిర్ణయించారు. ఇప్పటి వరకూ 1200 బోర్లు కూడా పూర్తి కాలేదు. పూర్తయినట్లు పేర్కొంటున్న బోర్లకు విద్యుత్‌ సర్వీసులు సైతం ఇవ్వని దుస్థితి నెలకొంది. జలకళలో వేసిన బోర్లు వినియోగంలోకి వచ్చిన పరిస్థితి లేకపోవడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. రెండున్నర ఎకరాల నుంచి ఐదెకరాల వరకూ ఉన్న ప్రతి రైతూ జలకళలో బోరు వేసుకునేందుకు అర్హులే. బోర్లు వేసుకునేందుకు దరఖాస్తు చేసుకుని ఏళ్లు గడుస్తున్నా బోర్లు మాత్రం వేయడం లేదు. ఈ పథకంలో బోర్లు వేసే కాంట్రాక్టర్లు ఎవరో కూడా తెలియని పరిస్థితి ఉంది. కాంట్రాక్టర్లపై అధికారుల పర్యవేక్షణ లేకుండాపోయింది. ఇప్పటి వరకూ జలకళలో రూ.40 కోట్లు పని జరిగితే రూ.30 కోట్లు పెండింగ్‌ బకాయిలు ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి జలకళ అమలు తీరు ఏమిటో ఇట్టే అర్థమవుతోంది. తొలుత జలకళలో బోర్లు వేసుకునే రైతులకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. తర్వాత విద్యుత్‌ కనెక్షన్‌ ఇవ్వడం లేదని చావుకబురు చల్లగా చెప్పింది. బోరు వేసుకునే క్రమంలో అత్యధిక ఖర్చు విద్యుత్‌ సర్వీసుకే అవుతున్నట్లు రైతులు చెబుతున్నారు.
ఊరించి... ఉసూరుమన్పించారు..!
జలకళ పథకం కింద రైతులకు ఉచిత బోర్లు వేస్తున్నట్లు ప్రభుత్వం చేసిన ఆర్భాటం అంతాఇంతా కాదు. బోర్లు వేసుకునే స్థోమత లేని రైతులంతా జలకళ పథకం ద్వారా బోరు వేసుకోవచ్చునని ఎంతో ఆశపడ్డారు. ఈ పథకాన్ని మొత్తం నీరుగార్చే యడంతో రైతులు ఉసూరుమంటున్న పరిస్థితి నెలకొంది. ఉచితంగా బోర్లు వేస్తామని చెప్పి ప్రభుత్వం వేయకపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇటీవల జరిగిన డిఆర్‌సి సమావేశంలో ఎంఎల్‌ఎలు మాట్లాడుతూ ఎస్‌సి, ఎస్‌టి, బిసిలకైనా జలకళ పథకంలో వేసే బోర్లకు విద్యుత్‌ కనెక్షన్‌ ఇచ్చేలా తీర్మానం చేయాలం టూ అడగాల్సిన పరిస్థితి ఏర్పడింది. సన్న, చిన్నకారు రైతులకు ఉపయోగపడే జలకళ పథకాన్ని ప్రభుత్వం నీరుగార్చడంపై రైతుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. కాంట్రాక్టర్లపై డ్వామా అధికారులకు సైతం కనీస అజమాయిషీ లేకుండా పోయిందనే విమర్శలు రైతుల నుంచి విన్పిస్తున్నాయి. దెందులూరు, చింతలపూడి వంటి నియోజ కవర్గాల్లో బోర్లు వేసుకునేందుకు ఎంతోమంది రైతులు ఎదురు చూస్తున్నట్లు ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. జలకళ పథకం అమలు ఏవిధంగా ఉందో దీన్నిబట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికైనా జలకళ పథకంలో బోర్లు కోసం దరఖాస్తు చేసుకున్న రైతులకు వెంటనే బోర్లు వేసేలా చర్యలు తీసుకుంటే ఎంతోమంది రైతులకు మేలు జరుగుతుంది.