Jul 26,2023 22:17

అధికారులతో సమీక్షిస్తున్న స్పీకర్‌ సీతారాం

- అధికారులకు స్పీకర్‌ తమ్మినేని ఆదేశం
ప్రజాశక్తి - ఆమదాలవలస: 
జల జీవన్‌ మిషన్‌ పనులు వేగవంతం కావాలని శాసనసభ స్పీకర్‌ తమ్మినేని సీతారాం అధికారులను ఆదేశించారు. పట్టణంలోని స్పీకర్‌ క్యాంపు కార్యాలయంలో గ్రామీణ తాగునీటి సరఫరా పథకం, రెవెన్యూ అధికారులతో బుధవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి స్వచ్ఛమైన తాగునీరు అందించేందుకు ప్రభుత్వం జల జీవన్‌ మిషన్‌ పథకంలో భాగంగా పనులు చేపడుతోందని చెప్పారు. ఇంటింటికీ కుళాయిల ద్వారా తాగునీరు అందించేందుకు వాటర్‌ ట్యాంకుల నిర్మాణాలను పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ పథకంలో భాగంగా నియోజకవర్గానికి రూ.157 కోట్లతో ప్రతి గ్రామంలో పనులు చేపడుతున్నామని చెప్పారు. వీటిలో ఎన్ని పూర్తయ్యాయని ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులను అడిగి తెలుసుకున్నారు. సాధ్యమైనంత త్వరగా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో నీటి నిల్వల కోసం వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి అవసరమయ్యే ప్రభుత్వ స్థలాలను వేగవంతంగా గుర్తించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. ఆ స్థలాల్లో వాటర్‌ ట్యాంకులు నిర్మాణం చేపట్టేందుకు ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సిద్ధంగా ఉండాలన్నారు. ఆమదాలవలస మండలంలో 47, సరుబుజ్జిలిలో 43, బూర్జలో 52, పొందూరు మండలంలో 40 వాటర్‌ ట్యాంకుల నిర్మాణానికి అనుమతులు మంజూరయ్యాయని వీటి నిర్మాణాల విషయంలో రెవెన్యూ, ఆర్‌డబ్ల్యుఎస్‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సమావేశంలో జెడ్‌పి సిఇఒ ఆర్‌.వెంకట్రామన్‌, ఆర్‌డబ్ల్యుఎస్‌ డిఇ సూర్యనారాయణ, నాలుగు మండలాల ఎఇలు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.