
ప్రజాశక్తి - కాళ్ల
జక్కరం గ్రామాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దేందుకు పంచాయతీ పాలకవర్గం, గ్రామస్తులు, దాతలు విశేషంగా కృషి చేస్తున్నారని గ్రామ సర్పంచి కూచంపూడి పద్మావతి అన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీణ్-2023 కార్యక్రమంలో భాగంగా జక్కరం గ్రామాన్ని కేంద్ర బృందం సోమవారం పరిశీలించింది. గ్రామంలో పారిశుధ్యం, పరిశుభ్రత , ఆరోగ్యకరమైన వాతావరణం కల్పించడం, పౌరులకు వారి సేవా డెలివరీని అందించడం, శుభ్రమైన గ్రామంగా తీర్చిదిద్దడం, మరుగుదొడ్ల వాడకం, రోడ్ల, డ్రెయినేజీ శుభ్రత, ఇంటింటి నుంచి చెత్త సేకరణ, చెత్త ప్రొసెసింగ్ సెంటర్ వర్మీ కంపోస్ట్ యూనిట్ డ్రై వెస్ట్ మేనేజ్‌మెంట్, షెడ్ దగ్గర ఉన్న సౌకర్యాలను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం గ్రామ సుందరీకరణ, సచివాలయ ప్రొఫైల్‌ను, రిజిస్టర్లు, రిపోర్ట్‌లు పరిశీలించారు. ఈ కార్యక్రమం మొదటి నుంచి గ్రామ సర్పంచి పద్మావతి, ఉప సర్పంచి లక్ష్మీపతిరాజు ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. ఎంపిటిసి సభ్యులు వేగేశ్న విజయ సహకారం అందిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఎంపిడిఒ జి.స్వాతి, డిపిఆర్‌సి నుంచి ఎన్.ఎడ్వర్డ్, పంచాయతీ కార్యదర్శి షేక్ జమాల్, స్వచ్ఛ ఆంధ్ర కార్పొరేషన్ నుంచి దినేష్, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు, పంచాయతీ పాలకవర్గ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.