
- పండుగలు మన జీవన స్రవంతిలో భాగం. ఇవి మన జాతీయతకు, సంస్కృతి వికాసానికీ దోహదం చేస్తాయి. ఏ మతానికి సంబంధించిన పండుగ అయినా సరే.. దాని వెనుక ఒక సందేశం దాగి ఉంటుంది. మానావాళికి హితాన్ని బోధించేదే 'పండుగ'. ముస్లింలు అత్యంత పవిత్రంగా జరుపుకునే 'రంజాన్' సైతం ఇదే హితాన్ని మానవాళికి అందిస్తుంది. చాంద్రమానాన్ని అనుసరించే ముస్లింల ఇస్లామియా కేలండర్ ప్రకారం.. తొమ్మిదో నెల 'రంజాన్'. దీనికి ప్రధాన కారణం 'ఖురాన్' గ్రంథం ఈ మాసంలో అవిర్భవించడమే! క్రమశిక్షణ, దాతృత్వాల కలయికే 'రంజాన్ మాసం'. మే 3న రంజాన్ పర్వదినం సందర్భంగా ఆ విశేషాలేంటో తెలుసుకుందాం..!
'రంజాన్' పేరు వినగానే అందరికీ సేమియా, షీర్ ఖుర్మాలే గుర్తుకొస్తాయి. పట్టణ వాసులకైతే దీంతోపాటు 'హలీమ్' 'హరీస్'లాంటి వంటకాలూ నోరూరిస్తాయి. ఈ పండుగను ముస్లిములు ఇంత ఆనందోత్సాహాల మధ్య జరుపుకోడానికి కారణం, ఇది ఒక్కరోజు పండుగ కాదు. నెలరోజులు నియమంగా జరుపుకునే ముగింపు ఉత్సవం. ఈ నెలరోజులూ ముస్లిముల ఇళ్ళు, వీధులన్నీ సేమియా, షీర్ ఖుర్మా, బగారా, బిరియానీ ఘుమఘుమలతో, అత్తరుపన్నీర్ల పరిమళాలతో, అలయి బలయి చెప్పుకుంటూ.. ఉల్లాస పరవళ్ల హడావిడితో అలరారుతుంటాయి. సహెరి, ఇఫ్తార్ సందడితో నిత్యనూతనంగా, కొత్తశోభతో మసీదులన్నీ కిటకిటలాడతాయి. హిందూ ముస్లింల మధ్య ప్రేమామృతాన్ని చిలకరిస్తూ, సేవాభావాన్ని పంచుతుంటాయి. విశ్వాసులందరూ పవిత్రగ్రంథ పారాయణంలో, తరావీ నమాజుల తన్మయత్వంలో ఓలలాడుతూ ఉంటారు. ఇలాంటి అనుభూతులు, ఆనందాలు, ఆహ్లాదాల సమ్మేళనాన్నే 'పండుగ' అనడం సమంజసం.
- వివిధ దేశాల్లో...
మనదేశంలో ముస్లింలు రాత్రి నిద్రపోయి, తెల్లవారి నాలుగు గంటలకు లేచి సహర్ చేస్తారు. గల్ఫ్ దేశాల్లో రాత్రంతా తింటూ తెల్లవారు ఝామున నమాజ్ చదివి, పడుకుంటారు. ఇక దుబాయిలోని ఏకైక హిందూ దేవాలయమైన కృష్ణ మందిరంలో భక్తులకు ప్రసాదాన్ని రంజాన్ నెల్లో ఇఫ్తార్ వేళల తర్వాతే ఇస్తారు. అరబ్బులు గల్ఫ్‌లోని అన్ని మసీదుల్లో రంజాన్ సందర్భంగా పౌష్టికాహారాన్ని నెలరోజులపాటు ఉచితంగా సరఫరా చేస్తారు. బహిరంగంగా తింటూ కనిపిస్తే శిక్ష తప్పదు.
ఇక మసీదుల ముందు బిక్షాటన చేసే వారికి కాకుండా ప్రభుత్వం ఆమోదం పొందిన చారిటీలకు మాత్రమే జకాత్ సొమ్మును ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తుంది. అయినప్పటికీ బిచ్చగాళ్ల బెడద విపరీతంగా ఉంటుంది. భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, యెమన్ దేశాల నుంచి వికలాంగులైన పేదపిల్లలను ఇక్కడికి తీసుకొచ్చి, వారిచేత బిక్షాటన చేయించడం కొన్ని యాచక ముఠాల ప్రత్యేకత. అందుకే మక్కా, మదీనా పుణ్యక్షేత్రాల్లో ప్రత్యేక వాహనాలలో బిచ్చగాళ్ల నిర్మూలన దళాలు 24 గంటలూ పనిచేస్తాయి. గల్ఫ్ జైళ్లలో మగ్గుతున్న భారతీయుల వివరాలు పేర్కొంటూ ఈ పుణ్య మాసంలో వారికి క్షమాభిక్ష పెట్టి, జైళ్ల నుంచి విడుదల చేయాల్సిందిగా ఇక్కడి రాజులకు భారతీయ దౌత్య కార్యాలయాలు ప్రత్యేక అభ్యర్థనలు చేస్తాయి. ఖురాన్‌ను కంఠస్థం చేసిన ఖైదీలను కూడా శిక్ష తగ్గించి, విడుదల చేస్తారు. స్వదేశానికి వెళ్లడానికి విమానం టిక్కెట్లకు డబ్బు లేకుండా జైళ్లలో మగ్గుతున్న భారతీయులకు మతంతో నిమిత్తం లేకుండా తమ జకాత్ సొమ్ముతో విమాన టిక్కెట్లను అనేకమంది అరబ్బులు అందించడం విశేషం.
- జకాత్.. ఫిత్రా..
రంజాన్ నెల్లో అత్యధిక దానధర్మాలు చేయడం ఈ పండుగ ప్రత్యేకత. సంపన్నులు రంజాన్ నెల్లో 'జకాత్' అచరించాలని ఖురాన్ బోధిస్తోంది. ఆస్తిలో నుంచి నిర్ణీత మొత్తాన్ని పేదలకు దానం చేయడాన్ని 'జకాత్' అని అంటారు. దీనిని పేదల ఆర్థిక హక్కుగా పేర్కొంటారు. దీని ప్రకారం ప్రతి ధనికుడు సంవత్సరాంతంలో మిగిలిన తన సంపద నుండి 30 శాతం చొప్పున ధన, వస్తు కానుకలను ఏవైనా నిరుపేదలకు దానంగా ఇస్తారు. పేదవారూ అందరితో పాటు పండుగను జరుపుకోడానికి, సంతోషంలో పాలుపంచుకునేందుకు ఈ 'జకాత్' ఉపయోగపడుతుంది.
'జకాత్'తో పాటు 'ఫిత్రా' దానానికి రంజాన్ నెల్లో ఎంతో ప్రాముఖ్యత ఉంది. మూడుపూటల తిండికి, ఒంటినిండా బట్టకు నోచుకోని పేదవారు ఎంతోమంది ఉన్నారు. ఇలాంటి అభాగ్యులకు, పేదవారికి పండుగ సందర్భంలో దానం చేయాలని ఇస్లాం మతం ఉద్భోదిస్తుంది. దీనినే ' ఫిత్రా దానం' అని పిలుస్తారు. ఉపవాస వ్రతాలు విజయవంతంగా ముగిసినందుకు ఖురాన్ పట్ల కృతజ్ఞతగా.. పేదలకు ఈ ఫిత్రా దానం విధిగా అందజేస్తారు. ఈ ఫిత్రా దానంలో 50 గ్రాముల తక్కువ రెండు కిలోల గోధుమలను గానీ, దానికి సమానమైన ఇతర ఆహారధాన్యాలను గానీ, దానికి సమానమైన ధనాన్నిగానీ పంచిపెట్టాలి. ఈ దానం కుటుంబంలోని సభ్యులందరి తరపునా పేదలకు అందజేయాలి.
ఉపవాసవ్రతం
ఖురాన్ ప్రకారం రంజాన్ నెల్లో విధిగా ఆచరించాల్సిన నియమం 'ఉపవాసవ్రతం'. ఈ ఉపవాసాన్ని పార్సీ భాషలో 'రోజా' అని అంటారు. సౌమ్ అనీ పిలుస్తారు.
- షవ్వాల్
ఈ విధంగా రంజాన్ నెలంతా పవిత్ర కార్యక్రమాలతో ముగుస్తూనే 'షవ్వాల్' (నెలవంక) ప్రత్యక్షమవుతుంది. ఈ నెలవంక దర్శనమిస్తేనే ముస్లిం సోదరులు ఉపవాసవ్రతాన్ని విరమిస్తారు. ఆ మరుసటి రోజు 'రంజాన్' ను జరుపుకుంటారు. 'షవ్వాల్' నెల మొదటిరోజున జరుపుకునే రంజాన్ పండుగను 'ఈదుల్ ఫితర్' అని అంటారు.
- ఇఫ్తార్ విందు
పేద, ధనిక తారతమ్యం లేకుండా.. సహృదయంతో.. సద్భావనతో ఆలింగనం చేసుకుంటారు. దీంతో ద్వేషాలన్నీ సమసి.. ప్రేమపూరిత. సోదర భావం ఇనుమడిస్తుంది. ఈ సందర్భంగా ప్రత్యేకంగా సేమ్యాతో చేసిన ఖీర్ ఒకరికొకరు తినిపించుకొంటారు. ముస్లింలే కాక ముస్లిమేతర సోదరులూ కలిసి శుభాకాంక్షలు చెప్పుకుంటారు. మానవుల మధ్య నెలకొన్న మత వైషమ్యాలు తొలగి, అందరిలోనూ చైతన్యాన్ని కలిగించి, ఐక్యంగా ముందుకు సాగే ధైర్యాన్నిస్తుంది.
- శాంతి.. సహనానికి ప్రతీక
నెల రోజులు కఠోర ఉపవాస దీక్షల అనంతరం చేసుకునే పండుగ ఈద్-ఉల్-ఫిత్' (రంజాన్). శాంతి, సహనానికి ప్రతీకగా ఈ పండుగ నిలుస్తోంది. మానవులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా, వ్యక్తిగతంగా, సామూహికంగా ఏదైనా మేలు జరిగినప్పుడు.. వారి అంతరంగాల్లోంచి ఆనందం వెల్లడవుతుంది. ఇది చాలా సహజమైన విషయం. అలాంటి మానవ సహజ భావోద్రేక ప్రత్యక్ష ప్రతిస్పందనల ప్రతిరూపమే పండుగలు, పబ్బాలు. ఈనాడు ప్రపంచవ్యాప్తంగా ముస్లిములు జరుపుకునే 'ఈదుల్ ఫిత్ర్' పర్వదినం కూడా అలాంటి భావోద్రేకాలు, ఆనంద తరంగాల ప్రతిస్పందనల ప్రత్యక్ష ప్రతిరూపమే ఈ పండుగ.
పండుగకు ప్రత్యేకంగా తయారుచేసిన తీపి వంటకాలను తమ హిందూ ముస్లిం, క్రైస్తవ, సిక్కు సోదరులందరికీ రుచి చూపించి, తమ ఆనందాన్ని వారితో పంచుకుంటారు. 'ఈద్ ముబారక్ 'అంటూ పరస్పరం శుభాకాంక్షలు తెలుపుకుంటారు. ఈ విధంగా 'ఈదుల్ ఫిత్ర్' పండుగ మానవుల్లో అత్యున్నత మానవీయ విలువలను, పరస్పర ప్రేమానురాగాలను పెంపొందిస్తుంది. పరోపకార గుణాన్ని, సహనం, త్యాగం, కరుణ, సానుభూతి భావాలను ప్రోదిచేసి, సమాజంలో సమానత్వం, సోదరభావం, సామరస్య వాతావరణాన్ని సృజిస్తుంది. కనుక రంజాన్ స్ఫూర్తిని నిరంతరం కొనసాగించాలి. నెలరోజుల శిక్షణ ప్రభావం భావి జీవితంలో ప్రతిఫలించాలి. మళ్లీ రంజాన్ వరకూ ఈ తీపి అనుభూతులు మిగిలి ఉండాలి. యావత్ ప్రపంచం సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలని మనసారా కోరుకుందాం.