Oct 03,2023 00:42

ప్రజాశక్తి - బాపట్ల
రవాణా రంగ కార్మికులకు గొడ్డలిపెట్టుగా ఉన్న జీవో నెంబర్ 21 రద్దు చేయాలని ఆలిండియా రోడ్ ట్రాన్స్ పోర్ట్ వర్కర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షులు నన్నపనేని శివాజీ డిమాండ్ చేశారు. స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో సిఐటియు ఆధ్వర్యంలో జరిగిన బాపట్ల జిల్లా ఆటో డ్రైవర్ల యూనియన్ విస్తృత సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆటో వర్కర్ల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలన్నారు. భారీగా పెంచిన ఫీజులు, పెనాల్టీలు తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 6న చలో విజయవాడ, ధర్నా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలన్నారు. బిజెపి అధికారంలోకి వచ్చాక పెట్రోల్, డీజిల్, గ్యాస్, ఇన్సూరెన్సుకు అదనపు చెల్లింపులు పెరిగిపోయాయని అన్నారు. రవాణా రంగాన్ని ఆదాయ వనరుగా భావించి ప్రభుత్వాలు అధికంగా వసూళ్లు చేస్తున్నాయని అన్నారు. పదేళ్ల కాలంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు రెట్టింపు అయ్యాయని అన్నారు. మోటార్ వాహన చట్ట సవరణ చేసి, రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ 21తీసుకురావడంతో చిన్న చిన్న పొరపాట్లకు ఆటో డ్రైవర్లకు తీవ్రమైన శిక్షలు విధిస్తున్నారని అన్నారు. 304/ఎ వంటి ప్రమాదకరమైన సెక్షన్లు బనాయించి జైలుకు పంపుతున్నారని అన్నారు. రోడ్ టాక్స్, గ్రీన్ టాక్స్ పేరుతో ఇష్టానుసారంగా పన్నులు వసూలు చేస్తున్నారని అన్నారు. రాష్ట్రంలో రహదారి వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందన్నారు. ప్రధాన రహదారులు గుంటలమయంగా మారడంతో ప్రమాదాలు జరుగుతున్నాయని, వాహనాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయని అన్నారు. దీంతో వాహనాల నిర్వహణ కష్ట సాధ్యమవుతుందన్నారు. మరోపక్క ఫీజులు పెనాల్టీలు పెంచడంతోపాటు, మోటారు విడిభాగాల ధరలు పెంచిందని అన్నారు. ఈ చలానాల పేరుతో జీవో నెంబర్ 21అమలు చేయడంతో భారీగా కేసులు రాస్తున్నారని అన్నారు. వాహనాలు రోడ్లపై నడపలేని పరిస్థితి ఎదురైందని అన్నారు. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి సిహెచ్ మజుందార్ మాట్లాడుతూ యువతకు ఉపాధి కల్పించకుండా, స్వయం ఉపాధి పొందుతూ, ప్రైవేటు ఫైనాన్స్ వద్ద అప్పులు తీసుకొని అధిక వడ్డీలు చెల్లిస్తూ అరకొర సంపాదనతో జీవనం సాగిస్తున్న వారిపై వివిధ రకాల పెనాల్టీలు వేయడం సరికాదన్నారు. ఉపాధి కల్పించాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదని అన్నారు. ఆటోలతో ఉపాధి పొందుతున్న వారిపై మరిన్ని భారాలు మోపితే రవాణా రంగ కార్మికులకు పోరాటం తప్ప మరో మార్గం లేదన్నారు. అందుకోసం అక్టోబర్ 6న విజయవాడ అలంకార్ సెంటర్లో జరిగే మహాధర్నాలోఆటో డ్రైవర్లు, వర్కర్లు పాల్గొనాలని కోరారు. సమావేశానికి ఎం బుచ్చిరాజు అధ్యక్షత వహించారు.  కార్యక్రమంలో ఆటో యూనియన్ నాయకులు గోపి, భాగ్యరాజు, సీతారామయ్య, రాంబాబు, సిఐటియు నాయకులు శరత్  పాల్గొన్నారు.