ప్రజాశక్తి- గ్రేటర్ విశాఖ బ్యూరో
జివిఎంసి స్థాయీ సంఘం ఎన్నికలలో వైసిపి కార్పొరేటర్లు విజయం సాధించారు. ఈ ఎన్నికల బరిలో 20 మంది అభ్యర్థులు (వైసీపీ, టిడిపి) పోటీలో నిలిచారు. ఎన్నికలలో గెలుపొందిన వైసిపి కార్పొరేటర్లలో ఉరికిటి నారాయణరావుకు 64 ఓట్లు, అక్రమాని పద్మకు 64 ఓట్లు, పీలా లక్ష్మీసౌజన్యకు 64 ఓట్లు పడ్డాయి. కోడిగుడ్ల పూర్ణిమకు 63, కంటిపాము కామేశ్వరికి 63, బల్ల లక్ష్మణరావుకు 63, భూపతి రాజు సుజాతకు 63 ఓట్లు పడగా, గుడ్ల విజయ సాయికి 62, బట్టు సూర్యకుమారికి 62, చల్లా రజినికి 61ఓట్లు చొప్పున పోలయ్యాయి. ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు జివిఎంసి ప్రధాన కార్యాలయంలో ఎన్నికను నిర్వహించారు. అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభించి సాయంత్రానికి గెలుపొందిన వివరాలను కమిషనర్ సాయికాంత్ వర్మ విడుదల చేశారు. ఈ ఓటింగ్‌లో జనసేన, సిపిఎం, సిపిఐ పాల్గొనలేదు. వైసిపి నుంచి కంపా హనోక్, మందపాటి సునీతలు విదేశాలకు వెళ్లడం వల్ల ఒటింగ్‌కు దూరంగా ఉన్నారు. కార్పొరేటర్ వంశీ ఎమ్మెల్సీ కావడం ఆ డివిజన్ ఖాళీగా ఉంది. అయితే అధికార పార్టీ నాయకులు తమకు అనుకూలమైన నిబంధనలు పెట్టుకుని ఎన్నిక జరిపించుకొని, వైసిపి అభ్యర్థులు గెలిచేలా చేశారని ప్రతిపక్షాలు, టిడిపి కార్పొరేటర్లు ఆరోపిస్తున్నారు.
అభివృద్ధిని చూసి గెలిపించారు : మేయర్
విశాఖలో ప్రభుత్వం చేసిన అభివృద్ధిని చూసి వైసిపికి చెందిన పది మంది కార్పొరేటర్లను స్టాండింగ్ కమిటీ సభ్యులుగా గెలిపించారని మేయర్ గొలగాని హరి వెంకట కుమారి పేర్కొన్నారు. వైసిపి అభ్యర్థుల సంఖ్యా బలానికి మించి ఓట్లు పడ్డాయని ఆమె ఆనందం వ్యక్తం చేశారు. టిడిపి కార్పొరేటర్లు కూడా ఓటేయడం బట్టి జగన్మోహన్‌రెడ్డి పాలనను ఆ పార్టీ కూడా ఆహ్వానిస్తున్నట్టేనని పేర్కొన్నారు.
గాజువాక ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ బలం లేకపోయినా పోటీకి దిగి అబాసుపాలవడం చంద్రబాబుకు అలవాటని వాఖ్యానించారు.










