May 30,2023 00:18

అనకాపల్లిలో మాట్లాడుతున్న బాలకృష్ణ

ప్రజాశక్తి - కలెక్టరేట్‌ (విశాఖపట్నం)
జివిఎంసి పారిశుధ్య విభాగంలో 482 పోస్టుల భర్తీలో కార్మికుల వారసులకు ప్రాధాన్యతనివ్వాలని కోరుతున్నప్పటికీ అధికారులు కుట్రపూరితంగా వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా సోమవారం జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యంలో టోకెన్‌ సమ్మె నిర్వహించారు. సమ్మెలో పాల్గొన్న వందలాది మంది కార్మికులు జివిఎంసి గాంధీ విగ్రహం వద్దకు చేరుకొని, అక్కడ నుంచి జివిఎంసి ప్రధాన కార్యాలయం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం స్పందనలో జివిఎంసి కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమానికి యూనియన్‌ గౌరవాధ్యక్షులు పి.వెంకటరెడ్డి, సిఐటియు విశాఖ జిల్లా అధ్యక్షులు కెఎం.శ్రీనివాస్‌, కార్యదర్శి పి.మణి, జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు టి.నూకరాజు, ప్రధాన కార్యదర్శి ఉరుకుటి రాజు, క్లాప్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు అనిల్‌ కుమార్‌, పి.సురేష్‌, యుజిడి వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు ఇ.ఆదినారాయణ, ఎం.ఈశ్వరరావు, రత్నం, సత్యవతి, గణేష్‌, శంకర్‌ రెడ్డి తదితరులు నాయకత్వం వహించారు. ఈ సందర్భంగా వెంకటరెడ్డి, కెఎం.శ్రీనివాస్‌ మాట్లాడుతూ జివిఎంసి పారిశుధ్య విభాగంలో 482 పోస్టుల భర్తీలో కార్మికుల వారసులకు ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. క్లాప్‌ డ్రైవర్లు, మలేరియా, వెటర్నరీ, నీటి సరఫరా, యుజిడి, పార్కుల్లో పనిచేసే కార్మికులకు సెమీ స్కిల్డ్‌ వేతనాలు అమలు చేయాలన్నారు. సమస్యలు పరిష్కారం కాకుంటే జూన్‌ 19 నుంచి నిరవధిక సమ్మెకు వెళ్తామని హెచ్చరించారు. కోవిడ్‌ విపత్కర పరిస్థితుల్లో పారిశుధ్య కార్మికులు ఎంతటి అకుంఠిత దీక్షతో పనిచేశారో వివరించారు. ఆ సమయంలో 18 మంది చనిపోయిన విషయాన్ని గుర్తుచేశారు. 25 ఏళ్లకుపైగా ప్రజలకు సేవలు అందించిన పారిశుధ్య కార్మికులు రిటైర్‌ అయినా, ప్రమాదంలో అంగవైకల్యం చెందినా, చనిపోయినా ఒక్క రూపాయి కూడా నష్టపరిహారం అందడం లేదన్నారు. అటువంటి కార్మికుల వారసులకు చెందాల్సిన డెత్‌, రిటైర్డ్‌, లాంగ్‌ ఆబ్సెంట్‌ పోస్టుల్లో వారి పిల్లలకు ఎందుకు ఉపాధి కల్పించరని ప్రశ్నించారు. ఇప్పటికే 482 పోస్టులు ఖాళీలు అయితే వారి పిల్లలు దరఖాస్తు చేసుకున్నారన్నారు. జివిఎంసి స్క్రూట్నీ కమిటీ ఫైనలైజ్‌ చేసిన 316 పోస్టులకుగాను 77 మందికి ఉపాధి కల్పిస్తున్నట్లు కమిషనర్‌ చెప్పడం సరైనదికాదన్నారు. ఇప్పటికే 300 మందిని టెంపరరీ పేరుతో వేసుకున్నారన్నారు. వీరు టెంపరరీ అయితే పర్మినెంట్‌ కార్మికుల వలే ఫేషియల్‌ రీడింగ్‌ ఎలా తీస్తారని ప్రశ్నించారు. పోస్టులు అమ్ముకుంటున్నారని సిఐటియు లఖిత పూర్వకంగా ఫిర్యాదు ఇస్తే ఎందుకు విచారణ జరపలేదన్నారు. కౌన్సిల్‌ ఆమోదం లేకుండా ఎందుకు వర్క్‌ ఆర్డర్‌ ఇచ్చారని ప్రశ్నించారు. సిఎం బంధువులమని చెప్పుకుంటున్న క్లాప్‌ కాంట్రాక్టర్లు బ్రోకర్ల ద్వారా డ్రెవర్లు నుంచి వసూలు చేసిన డిపాజిట్‌ డబ్బులను తిరిగి ఇచ్చేయాలని డిమాండ్‌ చేశారు. జాయింట్‌ లేబర్‌ కమిషనర్‌ ఆదేశాలను అమలుచేయాలని కోరారు. సమస్యలపై పోరాడుతున్న కార్మిక నేత పి.వెంకటరెడ్డి గొంతు నొక్కడానికి తప్పుడు కేసులు పెట్టడం, అవినీతి ఆరోపణలు చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వ గెజిట్‌ ప్రకారం వాల్వ్‌ ఆపరేటర్లకు, ఎలక్ట్రికల్‌, పెట్రోల్‌ హెల్పర్లకు, పార్కుల గార్డెనెర్లకు సెమీస్కిల్డ్‌ వేతనం రూ.18500 చెల్లించాలన్నారు. ఇఎస్‌ఐ, పిఎఫ్‌ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. జనాభా విస్తీర్ణం ఆధారంగా సిబ్బందిని పెంచి నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపా డాలన్నారు. మున్సిపల్‌ కార్మికుల పోరాటానికి ప్రజలు సంపూర్ణ మద్దతు తెలియజేయాలని కోరారు. అనంతరం కమిషనర్‌కు సమ్మె నోటీసు అందజేశారు.
భీమునిపట్నం : జివిఎంసి పారిశుధ్య కార్మికులు, క్లాప్‌ డ్రైవర్లు, వెటర్నరీ, యుజిడి, నీటి సరఫరా కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ జివిఎంసి కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ యూనియన్‌ (సిఐటియు) ఆధ్వర్యాన భీమిలి జోనల్‌ కార్యాలయం ఎదుట ఆయా విభాగాల కార్మికులు టోకెన్‌ సమ్మె నిర్వహించారు. అనంతరం కార్యాలయం సూపరింటెండెట్‌ శ్రీనివాస్‌కు వినతి పత్రం అందజేశారు. ధర్నాకు ముందు గంట స్తంభం నుంచి జోనల్‌ కార్యాలయం వరకు కార్మికులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యూనియన్‌ జోన్‌ అధ్యక్షులు ఆర్‌ఎస్‌ఎన్‌.మూర్తి, కార్యదర్శి రవ్వ నరసింగరావు, నాయకులు రామకృష్ణ, రమణ, అంజిబాబు, రాజు, రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.
అనకాపల్లి:జివిఎంసి పరిధిలో పనిచేస్తున్న క్లాప్‌ డ్రైవర్లు, పారిశుధ్య కార్మికులు సోమవారం ఒక రోజు టోకెన్‌ సమ్మె చేశారు. ఇందులో భాగంగా జివిఎంసి అనకాపల్లి జోనల్‌ కార్యాలయం వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా అధ్యక్షులు ఆర్‌.శంకర్రావు, సిపిఎం సీనియర్‌ నాయకులు ఎ.బాలకృష్ణ మాట్లాడుతూ సమస్యలను పరిష్కరించాలని ఆరు నెలలుగా ఆందోళన చేస్తున్నా పరిష్కరించకపోవడం దారుణమన్నారు. కార్యక్రమం క్లాబ్‌ డ్రైవర్స్‌ యూనియన్‌ నాయకులు శివ, సంతోష్‌, రాము, అజరు, కార్మికులు పాల్గొన్నారు.