
ప్రజాశక్తి -అనకాపల్లి
జీవీఎంసీ పరిధిలోని పారిశుధ్య కార్మికులు, ఇంజనీరింగ్, నీటి సరఫరా, యూజిడి, పార్కులు ఇతర అన్ని సెక్షన్ల కార్మికుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ జీవీఎంసీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) అధ్వర్యంలో గురువారం అనకాపల్లి జోనల్ కార్యాలయం వద్ద ధర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ జోనల్ గౌరవ అధ్యక్షులు గంటా శ్రీరామ్, సీఐటీయు జిల్లా అధ్యక్షులు ఆర్.శంకరరావు మాట్లాడుతూ సమస్యలకు కారణమైన ఆప్కాస్‌ను వెంటనే రద్దు చేసి కార్మికులందరినీ పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమానపనికి సమాన వేతనం చెల్లించాలని, కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలని కోరారు. సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్ స్కీమును పర్మెనెంటు ఉద్యోగులకు కొనసాగించాలని, క్లాప్ డ్రైవర్లకు రూ.18,500 చెల్లించాలని, డ్రైవర్లు, మలేరియా, కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్సులు చెల్లించాలని, రిటైర్డ్ కార్మికులకు రిటైర్‌మెంట్ బెనిఫిట్, గ్రాట్యూటీ చెల్లించాలని, చనిపోయిన లేదా రిటైర్ కార్మికుల కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పించాలని, ప్రభుత్వ పథకాలు అమలు చేయాలని కోరారు. పర్మనెంట్ ఉద్యోగుల సరెండర్ లీవ్ పెండింగ్ బిల్స్ విడుదల చేయాలని, డైలీ వేజ్ కార్మికులను మున్సిపల్ కార్మికులుగా గుర్తించాలని, కాంటాక్ట్ కార్మికులకు 15 రోజుల లీవును వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు బొమ్మల రాము, నిమ్మకాయల అజరు, సోమాదుల వాసు, ఎస్ నూకరాజు, శేఖర్, అమ్మాజీ, శ్రీనివాసరావు, శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.