Dec 27,2022 23:38

మీడియా సమావేశంలో జివిఎంసి ఏడాది అభివృద్ధిపై మాట్లాడుతున్న మేయర్‌ హరివెంకటకుమారి

ప్రజాశక్తి - గ్రేటర్‌ విశాఖ బ్యూరో
'గత ఏడాదితో పోల్చి చూస్తే ఈ ఏడాది జివిఎంసి ఆదాయం పెరుగుదల మెరుగ్గా ఉంది. భవన నిర్మాణ ప్లాన్‌ల ఆమోదం 2021లో 6100 దరఖాస్తులతో రూ.150కోట్లు ఆదాయం లభించగా, 2022 సంవత్సరం 6700 దరఖాస్తులతో రూ.208 కోట్లు లభించింది. సుమారు 30శాతం అధికంగా సిటీ ప్లానింగ్‌ (భవన నిర్మాణ) అనుమతుల ద్వారా సాధ్యమైంది. రెవెన్యూ కలెక్షన్స్‌ గత ఏడాది రూ.228 కోట్లు కాగా ఈ ఏడాది రూ.383 కోట్లుగా ఉంది. సరైన విధానంతో ముందుకు సాగితే ప్రగతి దిశగా జివిఎంసిని నడిపించవచ్చని, ఈ కొత్త సంవత్సరంలోనూ అన్ని రంగాల్లో నగర పాలక సంస్థను ముందుకు తీసుకెళ్తామని' జివిఎంసి మేయర్‌ గొలగాని హరివెంకటకుమారి, కమిషనర్‌ రాజబాబు స్పష్టం చేశారు. జివిఎంసి పాత సమావేశ మందిరంలో మంగళవారం ఏర్పాటుచేసిన విలేకర్ల సమావేశంలో ఈ ఏడాది జరిగిన అభివృద్ధిపై మేయర్‌ హరివెంకటకుమారి సమీక్ష చేసి నివేదికను చదివి వినిపించారు. 'చెత్త పన్నును జివిఎంసి పరిధిలో ప్రజలు ఎక్కడా తిరస్కరించడం లేదని, అలాగని బలవంతం కూడా చేయొద్దని సిబ్బందికి కమిషనర్‌, మేయర్‌ సూచించారు. ఏడాది ప్రగతిని మేయర్‌ వెల్లడిస్తూ... 97 మంది కార్పొరేటర్ల సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేస్తూ, ప్రజలకు మౌలిక సదుపాయాలు, సంక్షేమ పథకాలు అందేలా పనిచేస్తున్నామని తెలిపారు. గడచిన ఏడాది సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ వస్తువులను నిషేధ విధానం తీసుకుని సక్సెస్‌ దిశగా జివిఎంసి పయనించి దేశ ప్రధాని ప్రశంసలను అందుకుందన్నారు. స్వచ్ఛ సర్వేక్షన్‌ -2022 నగరాల పోటీల్లో విశాఖకు దేశంలోనే నాలుగో పరిశుభ్ర నగరంగా, 'గార్బేజ్‌ ఫ్రీ సిటీ'లో 5 స్టార్‌ ర్యాంకింగ్‌ లభించాయని చెప్పారు.
జివిఎంసి నగర అభివృద్ధిలో భాగంగా 2021-22 సంవత్సరానికి గాను ప్రజా పనులు రూ.115కోట్లా 57లక్షలతో 748 పనులు చేపట్టగా, 559 పనులను రూ.74కోట్లా 17లక్షలతో పూర్తిచేశామని మేయర్‌ వివరించారు. వార్డు అభివృద్ధి ప్రణాళికలో భాగంగా 98 వార్డులకు రూ.148 కోట్లా 15లక్షల వ్యయంతో 939 పనులు చేపట్టగా 279 పూర్తయ్యాయని పేర్కొన్నారు.
14, 15 ఆర్థిక సంఘాల నిధుల వ్యయం
14వ ఆర్థిక సంఘం నిధులు రూ.21.31 కోట్లతో 8 పనులు చేపట్టగా 4 పూర్తయి మిగతా 4 పురోగతిలో ఉన్నాయని, 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.146కోట్లతో చేపట్టిన 3 పనులు టెండర్‌ దశలో ఉన్నాయని, 3 పనులు ఇతర శాఖలకు కేటాయిచామని తెలిపారు.
స్మార్ట్‌సిటీ పనులు
స్మార్ట్‌ సిటీ అభివృద్ధి పనుల్లో భాగంగా 61 స్మార్ట్‌ సిటీ ప్రాజెక్టు పనులకు రూ.1000 కోట్లతో ప్రణాళిక రూపొందించగా, వీటిలో రూ.416.70 కోట్లతో 50 ప్రాజెక్టులు పూర్తిచేశామని. రూ.323.26 కోట్లతో 9 ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని చెప్పారు. రూ.942 కోట్లతో రెండు భూగర్బ మురుగు నీటి పారుదల ప్రాజెక్టు పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. అవుట్‌సోర్సింగ్‌లో పనిచేస్తున్న పారిశుధ్య కార్మికులకు వారి వేతనంతో పాటు రాష్ట్ర ప్రభుత్వం అదనంగా ఇచ్చే హెల్త్‌ అలవెన్స్‌ రూ.6వేలు అందించడం జరుగుతుందన్నారు.
చెత్త పన్నుపై అవగాహన లేనందునే సమస్యలు
చెత్త పన్ను అన్ని చోట్లా వసూళ్లు జరుగుతున్నాయని, ఎక్కడా బలవంతం చేయడం లేదని కమిషనర్‌ పి.రాజబాబు తెలిపారు. ప్రజలు చెత్త పన్నును తిరష్కరించడం లేదని చెప్పారు. కొన్నిచోట్ల వార్డుల్లో చెత్త పన్ను చెల్లించకపోతే పెన్షన్‌లు ఆపేస్తామనే బెదిరింపులు సిబ్బంది చేస్తున్నట్లు వస్తున్న వార్తలపై ఆయన స్పందిస్తూ 'అవగాహన లేనందునే వాలంటీర్లు, సచివాలయ సిబ్బంది ఎక్కడైనా అలా అని ఉండొచ్చని' దీనిపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. నెలకు జివిఎంసి పరిధిలో చెత్త పన్ను రూ.5.7కోట్లు రావాల్సి ఉండగా రూ.2.50కోట్లు వసూళ్లవుతుందని, ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకూ రూ.24కోట్లు వసూలైందని చెప్పారు. జివిఎంసిలో రెవెన్యూ వసూళ్లు గత బకాయిలు రూ.100కోట్లలో రూ.37కోట్లు వసూలు చేశామని తెలిపారు. ఈ సమావేశంలో జివిఎంసి డిప్యూటీ మేయర్లు జియ్యాని శ్రీధర్‌, కట్టమూరి సతీష్‌, చీఫ్‌ ఇంజినీరు రవికృష్ణరాజు, చీఫ్‌ సిటీ ప్లానర్‌ (సిసిపి) సురేష్‌ కుమార్‌, జివిఎంసి అడిషనల్‌ కమిషనర్లు వర్మ, సన్యాసిరావు పాల్గొన్నారు.