ప్రజాశక్తి-చింతూరు
రాష్ట్ర వ్యాప్తంగా సివిల్ సప్లై, గిరిజన కార్పొరేషన్‌లో పనిచేస్తున్న హమాలీ కార్మికులకు కూలీ రేట్లు పెంపు విషయంలో జరిగిన చర్చలలో వచ్చిన హామీలను జిఒ రూపంలో విడుదల చేసి అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి పల్లపు వెంకట్ డిమాండ్ చేశారు. చింతూరు జీసీసీ కార్యాలయం ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో కార్మికులు మంగళవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా వెంకట్ మాట్లాడుతూ కార్మికులు కూలిరేట్లు పెంచాలని ఆందోళన చేసిన నేపథ్యంలో పౌర సరఫరాల శాఖ ఎండీ యూనియన్ నాయకులతో విజయవాడలో చర్చలు చేసి కూలీ రేటు క్వింటకు రూ.22 నుండి రూ.25కు పెంచుతామని, యూనిఫామ్ కుట్టుకూలి ఒక జతకు రూ.600 నుండి రూ.700కు పెంచుతామని, పెంచిన రేట్లు 2022 జనవరి నుండి అమలు చేసి ఏరియర్స్ చెల్లిస్తామని, హమాలీలకు మంచి నీళ్లకు నెలకు రూ.300 ఇస్తామని, ఈఎస్‌ఐ అమలుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు. చర్చలు చేసి 6 నెలలు గడుస్తున్నా అధికారులు ఇచ్చిన హామీలను జిఒ రూపంలో ఇచ్చి అమలు చేయడం చేయలేదని పేర్కొన్నారు. హమాలీల చేత వెట్టి చాకిరీ చేయించుకుంటూ వారి కుటుంబాలను ఆర్థిక ఇబ్బందులలోకి నెట్టివేయడం దారుణమన్నారు. చింతూరు, మారేడుమిల్లి, రంపచోడవరం, అడ్డతీగల ఎంఎల్‌ఎస్ పాయింట్స్ నుండి వచ్చి చేసిన అదనపు పనికి పాడేరు డిఎం నుండి రావాల్సిన కూలీ డబ్బులను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికైనా అధికారులు ఇచ్చిన హామీని నిలపెట్టుకోలేక పోతే డిసెంబర్‌లో నిరవధిక సమ్మె చేస్తామని హెచ్చరించారు. అనంతరం జీసీసీ గొడౌన్ ఇన్‌ఛార్జికి వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో హమాలీలు స్వామి, రాజు, నాగార్జన, రాము, నాగు, చంద్రయ్య, చిట్టిబాబు, రమేష్, మంగరాజు, రామారావు, ముత్తయ్య, అప్పారావు, రాముడు, సీతయ్య పాల్గొన్నారు.










