ప్రజాశక్తి -గాజువాక : కూర్మన్నపాలెంలో సర్వేనెంబర్105లోని జిరాయితీ స్థలాన్ని వైసిపి చెందిన కొంతమంది వ్యక్తులు దొంగ డాక్యుమెంట్లు సృష్టించి, కబ్జా చేయాలని చూస్తున్నారని టిడిపి జిల్లా అధ్యక్షులు పల్లాశ్రీనివాసరావు అన్నారు. ఈ మేరకు బాధ్యులపై తగు చర్యలు తీసుకుని, బాధితులకు న్యాయం చేయాలని తహశీల్దార్ సుజాతకు గురువారం ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా బాధితులు తరఫున శ్రీనివాసరావు మాట్లాడుతూ, కొన్నేళ్ల క్రితం కొనుగోలు చేసిన స్థలాన్ని దొంగడాక్యుమెంట్లు సృష్టించి కబ్జా చేయాలని చూస్తున్నారని, నిజమైన భూహక్కుదారులను బెదిరిస్తున్నారన్నారు. ఈ అక్రమానికి దువ్వాడ సిఐ వత్తాసు పలుకుతూ, బ్రోకర్లు కొమ్ముకాయడం దుర్మార్గమన్నారు. అంతేకాక సివిల్ వ్యవహారాల్లో సిఐ వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని, దీనిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. బాధితులకు న్యాయం జరిగే వరకు వారి పక్షాన టిడిపి పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు.










