ప్రజాశక్తి- కె.కోటపాడు
మండలంలోని కె.సంతపాలెం గ్రామ పరిధిలోని సర్వే నెంబర్ 126లో 27, 118 నెంబర్లలో తమ జిరాయితీ భూమిని గ్రామ సర్పంచ్ చల్ల మంగ భర్త చల్ల సింహాద్రి నాయుడు (పోస్టు నాయుడు) ప్రభుత్వ భవనాలు పేరు చెప్పి కబ్జాకు పాల్పడుతున్నాడని భూమి హక్కుదారులు బుధవారం సంబంధిత భూమి వద్ద తమ పట్టాలను చూపిస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు విలేకర్లతో మాట్లాడుతూ ఈ భూమి విలువ సుమారు రూ.2 కోట్లు ఉంటుందన్నారు. వంశపారపర్యంగా తమ కుటుంబ సభ్యులకు చెందిన ఈ భూమిని బంజర భూమిగా చిత్రీకరించి కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపించారు. ఈ భూమిపై తమకు ఎటువంటి హక్కు లేదని, ఆ భూమిని అప్పగించకుంటే కేసులు పెడతామని తమను సర్పంచ్ భర్త బెదిరిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై తమకు న్యాయం చేయాలని తహశీల్దారు కార్యాలయంలోనూ, పోలీస్ స్టేషన్‌లోనూ ఫిర్యాదు చేశామని తెలిపారు. అయినా సర్పంచ్ భర్త తన అధికార బలంతో ప్రభుత్వ అధికారులను ప్రలోభ పెట్టి తమకు న్యాయం జరగకుండా అడ్డుపడుతున్నాడని, తన అనుచరులతో అక్రమంగా నిర్మాణాలు కూడా చేపడుతున్నాడని తెలిపారు. మంచి చేస్తారని నమ్మి ఓట్లు వేస్తే మాకు నమ్మకద్రోహం చేస్తున్నాడని వాపోయారు. దీనిపై ప్రభుత్వ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని తమ భూమిని తమకు అప్పగించాలని కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో బాధిత రైతులు చల్లా శ్రీను, చల్ల చిన్న సన్నిబాబు, చల్ల నాయుడు, చల్ల సింహాద్రి, చల్ల సన్నిబాబు, చల్ల సూర్యనారాయణ, చల్ల రామునాయుడు, కసిరెడ్డి దేముడు, బండారు మల్లేష్, బండారు దేముళ్ళు తదితరులు పాల్గొన్నారు.
డిప్యూటీ తహశీల్దారు రమేష్ వివరణ
జిరాయితీ భూమి ఆక్రమణలపై తమకు ఫిర్యాదు వచ్చిందని, దీనిపై సర్వేయర్ ద్వారా సర్వే చేయించి రైతులకు న్యాయం జరిగేలాగా చర్యలు తీసుకుంటామని డిప్యూటీ తహశీల్దారు రమేష్ తెలిపారు.










