Sep 26,2023 00:39

కలెక్టరేట్‌ వద్ద ధర్నా చేస్తున్న ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌ఇఎ నాయకులు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి-అనకాపల్లి
ప్రభుత్వం అమలు చేయాలని చూస్తున్న గ్యారంటీ పెన్షన్‌ స్కీమ్‌ని వ్యతిరేకిస్తూ ఫ్యాప్టో, ఎపిసిపిఎస్‌సిఎ ఆధ్వర్యంలో సోమవారం అనకాపల్లి జిల్లా కలెక్టర్‌ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్‌ గొంది చినబ్బారు మాట్లాడుతూ పెన్షన్‌ అంటే ఉద్యోగికి, రిటైర్మెంట్‌ తరువాత ప్రభుత్వం చెల్లించే భరణం, జీవన భృతి అని, అంతేగాని ప్రభుత్వం ఉద్యోగి నుండి చందా వసూలు చేసి, పెన్షన్‌ ఇస్తామని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. డిఏలు, పీఆర్‌సిలు వర్తించని జిపిఎస్‌ విధానం తమకొద్దన్నారు. ఎపిసిపిఎస్‌ సిఎ రాష్ట్ర అధ్యక్షులు రొంగలి అప్పలరాజు మాట్లాడుతూ సిపిఎస్‌ను రద్దు చేస్తామని చెప్పిన జగన్‌ ఓపిఎస్‌ బదులు జిపిఎస్‌ను తెర మీదకి తెచ్చి ఉద్యోగులను మోసం చేశారన్నారు. అనంతరం ఫ్యాప్టో, ఏపీ సీపీఎస్సీఏ నాయకులు జిల్లా కలెక్టర్‌ని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఏపీటీఎఫ్‌ నాయకులు తమరాన త్రినాథ్‌, డిటిఎఫ్‌ నాయకులు డి.మధు, యుటిఎఫ్‌ నాయకులు జి.గాయత్రి, పిఆర్‌టియు నాయకులు గోపీనాథ్‌, పెద్ది నాయుడు, భాషా సంఘం నాయకులు రామకృష్ణ తదితరులు ధర్నా శిబిరాన్ని సందర్శించి తమ సంఘీభావం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్యాప్టో సెక్రటరీ జనరల్‌ వై.సుధాకర్‌, డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ ఎన్‌. సన్యాసి నాయుడు, కో-చైర్మన్‌ సాయి ప్రసాద్‌, ప్రేమ్‌ కుమార్‌, ఎం.శ్రీను, సిపిఎస్‌ సంఘం నాయకులు కోరుకొండ సతీష్‌, సూర్య ప్రకాష్‌, గౌరి నాయుడు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌ (విశాఖ) : జిపిఎస్‌ ఉపసంహరించుకొని, ఓపిఎస్‌ విధానాన్ని పునరుద్ధరించాలని ఫ్యాప్టో రాష్ట్ర కో-కన్వీనర్‌ జోజిబాబు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఫ్యాప్టో ఆధ్వర్యాన ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అధికారంలోకి వస్తే సిసిఎస్‌ రద్దు చేస్తామని జగన్మోహన్‌రెడ్డి హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. నాలుగున్నరేళ్ల తర్వాత జిపిఎస్‌ పేరిట మెడ మీద కత్తి పెట్టడం సరికాదన్నారు. తమకు ఓపిఎస్‌ ఉండాలని, జిపిఎస్‌ వద్దు అని స్పష్టంచేశారు. ఫ్యాప్టో జిల్లా అధ్యక్షులు కొటాని శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం స్పందన కార్యక్రమంలో కలెక్టర్‌కు వినతిపత్రం అందించారు.