Oct 13,2023 21:48

పోస్టు కార్డులు ప్రదర్శిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

 కడప అర్బన్‌: ఉద్యోగ, ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి అధికారంలోకి రాకముందు ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలని యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహేష్‌ బాబు డిమాండ్‌ చేశారు. కడప యుటిఎఫ్‌ భవన్‌లో పోస్ట్‌ కార్డు ఉద్యమాన్ని ప్రారంభించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి సిపిఎస్‌ను రద్దుచేసి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరిస్తానని, మాట తప్పను మడమ తిప్పనని తెలిపి పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించకుండా జిపిఎస్‌ అనే మరో దుర్మార్గపూరితమైన పెన్షన్‌ విధానాన్ని ప్రవేశపెట్టడం సిగ్గుచేటని అన్నారు. ఉద్యోగ ఉపాధ్యాయులు పాత పెన్షన్‌ కోసం ఎదురు చూస్తుంటే గారడీలు చేసే జిపిఎస్‌ విధానాన్ని ప్రవేశ పెట్టడం ఉద్యోగ ఉపాధ్యాయులను మోసగిం చడమేనని తెలిపారు. ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే పాత పెన్షన్‌ ప్రవేశపెట్టాలి తప్ప మరో కొత్త పెన్షన్‌ విధానాన్ని ప్రవేశ పెడితే అంగీకరించే ప్రసక్తే లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం 2004కు ముందు అపాయింట్మెంట్‌ అయినా ఉద్యోగులం దరికీ పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలని తెలిపినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం మాత్రం దానిని అమలు చేయకుండా కాలక్షేపం చేయడం మంచిది కాదని తెలిపారు. 2003 డిఎస్‌సి వారికి వెంటనే పాత పెన్షన్‌ వర్తింప చేస్తున్నట్లుగా ఉత్తర్వులు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. పాత పెన్షన్‌ విధానం ప్రవేశపెట్టకపోతే ఈనెల 18 నుంచి భవిష్యత్‌ కార్యాచరణ మొదలవుతుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ట్రెజరర్‌ నరసింహారావు, జిల్లా కార్యదర్శి ఏజాస్‌ అహ్మద్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ ప్రభాకర్‌, నాయకులు కిరణ్‌ కుమార్‌, గోపీనాథ్‌, కిరణ్‌ బాబు, శివశంకర్‌, సమీర్‌ బాషా, ప్రకాష్‌ బాబు, శ్రీనివాసులు పాల్గొన్నారు.