ప్రజాశక్తి - మాచర్ల : సిపిఎస్ రద్దుకు బదులు జిపిఎస్ తెస్తామనే ప్రభుత్వ నిర్ణయాన్ని పిడిఎఫ్ ఎమ్మెల్సీలం వ్యతిరేకిస్తున్నట్లు ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఓపీఎస్ విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. మాచర్లకు గురువారం వచ్చిన ఆయన స్థానిక రామాలయంలో విలేకర్లతో మాట్లాడారు. 10 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులరైజ్ చేయడాన్ని ఆహ్వానిస్తున్నామని, అయితే 2014 జూన్ రెండు నాటికి ఐదేళ్ల సర్వీసు పూర్తయిన వారికి మాత్రమే పరిమితం చేయడం వల్ల సుమారు నాలుగువేల మంది అవకాశాలు కోల్పోతున్నారని, తెలంగాణలో మాదిరిగా 2014 జూన్ నాటికి ఉన్న కాంట్రాక్టు ఉద్యోగులందర్నీ పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ నిర్ణయం ప్రకారమైతే మాచర్ల జూనియర్ కాలేజీలో 13 మంది కాంట్రాక్టు లెక్చరర్లలో ఒక్కరే రెగ్యులర్ అవుతారని చెప్పారు. ఉద్యోగులకు బదిలీ ప్రమోషన్లలో ఉమ్మడి జిల్లా ఆధారంగా జరుగుతున్నాయని, పల్నాడు జిల్లాలోని ఖాళీలన్నీ చూపించనందువల్ల ఇక్కడి ఖాళీలు భర్తీ అయ్యే అవకాశం లేదని, ఈ ప్రాంత ప్రజల నష్టపోతారని తెలిపారు. పల్నాడు జిల్లాకు ప్రాధానమినిచ్చి బదిలీ ప్రమోషన్లు చేపట్టాలని కోరారు. వైసిపి ప్రభుత్వం ఏర్పడ్డాక ఒక్క డీఎస్సీ కూడా ప్రకటించలేదని, రాష్ట్రంలో 25 వేలకు పైగా ఉపాధ్యాయ ఖాళీలున్నాయని, వెంటనే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. వెనుకబడిన ప్రాంతమైన మాచర్లలో పీజీ సెంటర్ ఏర్పాటుకు ఆచార్య నాగార్జున యూనివర్సిటీ గతంలోనే తీర్మానించినా అమలు కాలేదన్నారు. పీజీ సెంటర్ వస్తే భవిష్యత్తులో అవి యూనివర్సిటీలుగా రూపుదిద్దుకునే అవకాశం ఉందని చెప్పారు. సిఐటియు నాయకులు గుంటూరు విజరు కుమార్ మాట్లాడుతూ కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ ఉద్యోగుల ందరికీ పర్మినెంట్ చేయాలని, ఎన్నికలప్పుడు అంగన్వా డీలకు ఇచ్చిన వాగ్దానాలనూ నెరవేర్చాలని కోరారు.










