
ప్రజాశక్తి-అనకాపల్లి
సిపిఎస్ స్థానంలో జిపిఎస్ ప్రవేశపెట్టాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని, జిపిఎస్‌ను అంగీకరించేది లేదని ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యుటిఎఫ్) జిల్లా ప్రధాన కార్యదర్శి గొంది చిన్నబ్బాయి స్పష్టం చేశారు. స్థానిక సిఐటియు కార్యాలయంలో శనివారం జరిగిన యుటిఎఫ్ జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిపిఎస్‌లో కొత్తదనం ఏమీలేదన్నారు. సిపిఎస్ పథకంలోనే కొన్ని మార్పులు చేసి జిపిఎస్‌గా నామకరణం చేశారని తెలిపారు. ఈ పథకంలో భాగంగా ఉద్యోగి తన వేతనంలో 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని, 33 శాతం పెన్షన్ ఇస్తామని ప్రభుత్వం చెబుతుందని పేర్కొన్నారు. ఒపిఎస్ విధానంలో ఉద్యోగికి చివరి వేతనంలో సగ భాగం పెన్షన్‌గా ఇస్తారని, ఉద్యోగి ఎలాంటి చందా చెల్లించనవసరం లేదని, అందువల్ల ఓపిఎస్ మాత్రమే అమలు చేయాలని కోరారు. గత ఎన్నికల్లో ప్రతిపక్ష నేతగా ఉన్న జగన్మోహన్‌రెడ్డి పలు సందర్భాల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తానని హామీ ఇచ్చారని, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పటికీ దానిని రద్దు చేయకుండా కాలయాపన చేస్తున్నారని విమర్శించారు. పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఇప్పటికే సిపిఎస్‌ను రద్దు చేసి, ఓపిఎస్‌ను పునరుద్ధరించే దిశగా అడుగులు వేస్తున్నారని, అదే బాటలో జగన్మోహన్‌రెడ్డి కూడా వెంటనే సిపిఎస్‌ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే, ఎంపీ, ఎమ్మెల్సీలకు పెన్షన్ పథకం వర్తిస్తున్నప్పుడు, ఉద్యోగులకు లేకపోవడం అన్యాయమన్నారు. ఈ కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు వత్సవాయి శ్రీలక్ష్మి, ఉపాధ్యక్షులు కట్టా శ్రీనివాసరావు, మహిళా ఉపాధ్యక్షులు జి.గాయత్రి, కోశాధికారి జోగా రాజేష్, జిల్లా కార్యదర్శులు పోలిమేర చంద్రరావు, శేషుబాబు, రమేష్‌రావు, రాష్ట్ర కౌన్సిలర్లు ఎల్లయ్యబాబు, గంజి నాగేశ్వరరావు, సీనియర్ నాయకులు వెంకట్రావు, ఆడిట్ మెంబర్ గేదెల శాంతిదేవి, అన్ని మండలాల నాయకులు పాల్గొన్నారు.