Sep 22,2023 22:38

ప్రజాశక్తి-కలక్టరేట్‌ (కృష్ణా) : సిపిఎస్‌ ఉద్యోగులకు నష్టం చేసే అత్యంత దుర్మార్గమైన జిపిఎస్‌కు ఉద్యోగులు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించబోమని సిపిఎస్‌ ఉద్యోగ సంఘ నాయకులు స్పష్టం చేశారు. జిపిఎస్‌కు వ్యతిరేకంగా శుక్రవారం జిల్లా కలక్టర్‌ కార్యాలయంతో పాటు జిల్లా వ్యాప్తంగా ఉన్న తహసిల్దార్‌ కార్యాలయాలలో ఉద్యోగులు నల్ల బ్యాడ్జ్‌ లతో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ జిపిఎస్‌ బిల్లుకి ఎవరైతే ఉద్యోగ సంఘ నాయకులు ఆమోదం తెలిపారో వారికి పాత పెన్షన్‌ని తీసివేసి వారికి ఆమోద్యయోగ్యమైన జి పి ఎస్‌ పథకాన్ని వారికి పైలెట్‌ ప్రాజెక్ట్‌ గా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు.రాజస్థాన్‌, ఛత్తిష్‌ గడ్‌ ,జార?ండ్‌, హిమాచల్‌ ప్రదేశ్‌, పంజాబ్‌, కర్ణాటక, సిక్కిం,రాష్ట్రాలలో పాతపెన్షన్‌ పునరుద్దరణ చేశారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం మీన మేషలు లెక్కిస్తూ జిపిఎస్‌ పేరుతో మరో మోస పూరిత విధానం తీసుకొస్తుందని మండి పడ్డారు. కాలికి ముళ్ళు గుచ్చుకుంటే అది తీయమంటే ముళ్ళు తీసి గునపం గుచ్చినట్టు ప్రభుత్వం తీరు ఉందని విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ రద్దు చేస్తాను అని హామీ ఇచ్చిన జగన్మోహన్‌ రెడ్డి ఇప్పుడు మాట తప్పడం సబబు కాదన్నారు.ఇచ్చిన హామీ మేరకు పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్దించాలని డిమాండ్‌ చేశారు. ఈ నిరసన కార్యక్రమంలో ఎపిఆర్‌ఎస్‌ఏ జిల్లా అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ పెపేటి.సత్యనారాయణ, కలక్టరేట్‌ అద్యక్షులు పామర్తి.శ్రీనివాస్‌, అసోసియేట్‌ ప్రెసిడెంట్‌ రిజ్వన్‌, సుభాష్‌, గౌతమ్‌, కష్ణమూర్తి, రాధ, పలువురు సీపీ ఎస్‌ ఉద్యోగులు పాల్గొన్నారు.