ప్రజాశక్తి- పల్నాడు జిల్లా : సిపిఎస్ స్థానంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని, దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని యుటిఎఫ్ పల్నాడు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పి.ప్రేమ్‌కుమార్, జి.విజయసారధి స్పష్టం చేశారు. యుటిఎఫ్ పల్నాడు జిల్లా ఆఫీస్ బేరర్స్ సమావేశంలో జిల్లా కేంద్రమైన నరసరావుపేటలోని యుటిఎఫ్ జిల్లా కార్యాలయంలో ఆదివారం నిర్వహించారు. సమావేశానికి అధ్యక్షత వహించిన పి.ప్రేమ్‌కుమార్ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన వారం రోజుల సిపిఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానం అమలు చేస్తామని ప్రతిపక్ష నేతగా జగన్‌మోహన్‌రెడ్డి హామీనిచ్చారని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చి నాలుగున్నరేళ్లయినా సిపిఎస్‌ను రద్దు చేయకపోగా జిపిఎస్ అంటూ కొత్త నాటకానికి తెరదీశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిపిఎస్ పథకం ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఏమాత్రమూ ఆమోదయోగ్యం కాదన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌ఘడ్, జార్ఘండ్, పంజాబ్, హిమాచల్‌ప్రదేశ్‌లో సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్ అమలు చేశాయని తెలిపారు. ఇప్పటికైనా సిపిఎస్ రద్దు చేసి ఓపిఎస్ అమలు చేయాలని, అప్పటి వరకూ యుటిఎఫ్ పోరాడుతుందని, ఇతర సంఘాలతో కలిసి ఉధృత ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. విజయసారధి మాట్లాడుతూ సిపిఎస్ పథకంలో కొన్ని మార్పులు చేసి జిపిఎస్‌గా పేరుపెట్టి ఉద్యోగ, ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మభ్యపెడుతోందన్నారు. ప్రభుత్వం ప్రవేశ పెట్టాలని గ్యారంటీ పెన్షన్ విధానం (జిపిఎస్) పథకంలో సైతం ఉద్యోగి తన జీతం నుండి 10 శాతం ప్రభుత్వానికి చెల్లించాలని 33 శాతం పెన్షన్ గ్యారంటీ అని చెప్పడమేగాని గ్యారెంటీ లేదని అన్నారు. ఎన్నికల వాగ్దానం మేరకు సిపిఎస్ రద్దు చేసి ఉద్యోగ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరారు. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు పాత పెన్షన్ ఎందుకు అమలు చేస్తున్నారో? ఉద్యోగ ఉపాధ్యాయులకు సమాధానం చెప్పాలన్నారు. 117 జీవో వల్ల ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయ పోస్టులు రద్దుచేసి ప్రమోషన్లు ఎంఇఒ-2 పోస్ట్‌లు సృషించడం సరికాదన్నారు. ఉపాధ్యాయుల కొరతతో ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు సరైన విద్య అందదని, పాఠశాల విద్య బలహీనపడి భవిష్యత్తులో ఉన్నత పాఠశాల విద్యార్థుల్లో చేరిక ఉండదని చెప్పారు. ఇదిమొత్తం ప్రభుత్వ విద్య నిర్వీర్యం, ప్రైవేటీకరణకు మార్గం మరింత సులభతరం అవుతుందని హెచ్చరించారు. దీనిపై ప్రభుత్వం పునరాలోచించాలన్నారు. సమావేశంలో నాయకులు కె.శ్రీనివాసరావు, ఎం మోహన్ రావు, ఏ.బాగేశ్వరిదేవి, జె.వాల్యానాయక్, వి.నాగేశ్వరరావు, ఆర్.అజరుకుమార్, కె.ఉషాసౌరి రాణి, ఎ.శ్రీనివాసరావు, షేక్ జమాల్, షేక్ గఫార్, రాష్ట్ర కౌన్సిలర్లు శ్రీనివాస్‌రెడ్డి, ఎన్.సుందర్రావు పాల్గొన్నారు.










