Sep 25,2023 21:37

కలెక్టరేట్‌ ఎదుట బైఠాయించిన ఉపాధ్యాయులు, ఉద్యోగులు

ప్రజాశక్తి-విజయనగరం టౌన్‌ : జిపిఎస్‌, సిపిఎస్‌లను రద్దు చేయాల్సిందేనని, పాత పెన్షన్‌ విధానాన్ని కొనసాగించాలని ఉపాద్యాయ సంఘాల ఐక్య వేదిక ఫ్యాఫ్టో, ఎపి సిపిఎస్‌ ఉద్యోగ సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. ఈమేరకు సోమవారం కలెక్టరేట్‌ వద్ద ఉపాధ్యాయులు, ఉద్యోగులు పెద్ద ఎత్తున ధర్నా చేపట్టారు. జిపిఎస్‌, సిపిఎస్‌లనురద్దు చేయాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. ఉదయం 9.30 గంటలకే చేరుకొని కలెక్టరేట్‌ ఔట్‌ గేటు ఎదుట బైఠాయించారు. ఫ్యాప్టో జిల్లా డిప్యూటీ సెక్రటరీ జనరల్‌ రమేష్‌ చంద్ర పట్నాయక్‌, సెక్రెటరీ జనరల్‌ డి.ఈశ్వరరావు, ఎపిసిపిఎస్‌ఇఎ రాష్ట్ర నాయకులు గంటా శ్రీనివాసరావు ఆధ్వర్యంలో కార్యక్రమం జరిగింది. ఈ సందర్బంగా రమేష్‌ చంద్ర పట్నాయక్‌ మాట్లాడుతూ జిపిఎస్‌ అనే మోసపూరిత పెన్షన్‌ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే, రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామని అన్నారు. డి.ఈశ్వరరావు మాట్లాడుతూ లోపబూయిష్టమైన జిపిఎస్‌ విధానాన్ని వెనక్కి తీసుకోకపోతే ఉద్యోగులు క్షమించరని అన్నారు. ఎపిసిపిఎస్‌ఇఎ జిల్లా అధ్యక్షుడు రాజబత్తుల శివ కుమార్‌ మాట్లాడుతూ జిపిఎస్‌ పేరుతో మోసం చేస్తే ఓట్‌ ఫర్‌ ఒపిఎస్‌తో తిప్పి కొడతామన్నారు. సిపిఎస్‌ను రద్దు చేసి పాత పెన్షన్‌ ఇస్తామని హామీ ఇచ్చి నేడు మోసం చేయడం ప్రభుత్వానికి తగదన్నారు. ఎవరి ప్రయోజనాల కోసం జిపిఎస్‌ను తీసుకొస్తున్నారని ప్రశ్నించారు. మోసపూరిత విధానాలకు మూల్యం చెల్లించుకునే రోజు దగ్గరలోనే ఉందని అన్నారు. ఫ్యాప్టో నాయకులు డి.శ్యామ్‌ మాట్లాడుతూ ఉద్యోగుల కంట్రిబ్యూషన్‌ లేని ఒపిఎస్‌ విధానానికి, మరి ఏ విధానం కూడా ప్రత్యామ్నయం కాదని అన్నారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కార్యవర్గ సభ్యులు వి.రమణ, భాస్కరరావు, షేక్‌ బుఖారి బాబు, పాల్తేరు శ్రీనివాసరావుతో వై.అప్పారావు కె.జోగారావు, జెవిఆర్‌కె ఈశ్వరరావు, సదాశివరావు, డి.రాము, కె.విజయగౌరి, తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమానికి పిఆర్‌టియు నాయకులు డి.శ్రీనివాస రావు రవీంద్రనాయుడు మద్దతు తెలిపారు. విఆర్‌ఒ సంఘం నాయకులు ఎస్‌.అప్పల నాయుడు, క్లాస్‌ ఫోర్‌ ఎంప్లాయిస్‌ అసోసియేషన్‌ నాయకులు గంగా ప్రసాద్‌, ఆపస్‌ నాయకులు జె.రామ్‌ నాయుడు, అధిక సంఖ్యలో ఉపాధ్యాయులు, ఉద్యోగులు పాల్గొన్నారు.