Sep 29,2023 00:29

పిడుగురాళ్లలో ప్రదర్శన నిర్వహిస్తున్న యుటిఎఫ్‌ నాయకులు, కార్యకర్తలు, ఉపాధ్యాయులు

ప్రజాశక్తి - పల్నాడుజిల్లా, వినుకొండ, పిడుగురాళ్ల : ప్రమాదకరమైన విద్యారంగ సంస్కరణలను ప్రభుత్వం అత్యంత దుర్మార్గంగా, ఏకపక్షంగా రుద్దుతోందని యుటిఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు ఎన్‌.వెంకటేశ్వర్లు అన్నారు. రాష్ట్రంలో 14 వేల పైగా ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయని, వీటిల్లో విద్యార్థులకు నాణ్యమైన విద్య ఎలా సాధ్యమో ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేశారు. యుటిఎఫ్‌ స్వర్ణోత్సవాల సందర్భంగా చేపట్టిన ప్రచార జాతా గురువారం పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేట, వినుకొండ, పిడుగురాళ్ల పట్టణాల్లో పర్యటించింది. జాతాకు ఉపాధ్యాయులు భారీగా హాజరై బైక్‌ర్యాలీతో ఘనస్వాగతం పలికారు. నరసరావుపేటలో జిల్లా అధ్యక్షులు పి.ప్రేమ్‌కుమార్‌ అధ్యక్షతన సభ నిర్వహించగా ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ విద్యారంగ వికాసం, ఉపాధ్యా యుల సంక్షేమమే లక్ష్యంగా చెన్నుపాటి వారసత్వాన్ని యుటిఎఫ్‌ పుణికిపుచ్చుకుందని చెప్పారు. సామాజిక స్పృహతో పని చేస్తున్న యుటిఎఫ్‌ అప్పారి వెంకటస్వామి, రామిరెడ్డి చూపిన బాటలో నిరంతరం ప్రయాణం చేస్తుందని అన్నారు. 50 ఏళ్లుగా ఉపాధ్యాయ ఉద్యమం సాధించిన విజయాలను నేటి పాలకులు హరిస్తున్నారని మండిపడ్డారు. హక్కులను, ప్రభుత్వ విద్యారంగాన్ని, పెన్షన్‌ను కాపాడుకోవడమే ప్రధాన లక్ష్యంగా యుటిఎఫ్‌ భవిష్యత్తులో పనిచేస్తుందన్నారు. స్వర్ణోత్సవాల ప్రచార జాత ముగింపు సందర్భంగా ఒకటో తేదీన విజయవాడ సిద్ధార్థ కళాశాలలో నిర్వహించే సభకు ఉపాధ్యాయులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ పల్నాడు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శుళు పి.ప్రేమ్‌కుమార్‌, జి.విజయసారధి మాట్లా డుతూ ఒపిఎస్‌ కోసం ఐక్య పోరా టాలకు సిద్ధమవుతామని అన్నారు. ప్రాథమిక పాఠశాలల విలీనాన్ని ఆపాలని కోరారు.
వినుకొండలో భారీ బైక్‌ ర్యాలీ అనంతరం యుటిఎఫ్‌ కార్యాలయంలో సభ నిర్వహించారు. వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నో త్యాగాలతో మహనీయులు నిర్మించిన యుటిఎఫ్‌ ఉపాధ్యాయ సమస్యలపై పోరాడ్డంలో అగ్రగామిగా ఉందన్నారు. జిపిఎస్‌ బిల్లును అసెంబ్లీలో ఆమోదించడం ఉపాధ్యాయ, ఉద్యోగ లోకానికి చీకటి రోజన్నారు. జిపిఎస్‌ను ఉపసంహరించుకునే వరకూ ఐక్య ఉద్యమాలను నిర్మిస్తామని స్పష్టం చేశారు. ఉపాధ్యాయ నియామకాలను చేపట్టకుండా ఉపాధ్యాయులపై పని భారాన్ని పెంచడాన్ని ఖండించారు.
పిడుగురాళ్లలోని జానపాడు రోడ్డు నుండి ప్రారంభమైన ర్యాలీ బస్టాండ్‌ మీదుగా యుటిఎఫ్‌ కార్యాలయానికి చేరింది. ఈ సందర్భంగా జెండాను సీనియర్‌ నాయుకులు ఎం.నాగయ్య ఆవిష్కరించారు. ఎన్‌.వెంకటేశ్వర్లు మాట్లడుతూ నేడు ఉపాధ్యాయులు పొందుతున్న టిఎలు, డిఎలు, పిఆర్‌సి, ఎరియర్స్‌ తదితర సదుపాయాలు మహనీయుల పోరాటం, త్యాగాల ఫలితాలేనని చెప్పారు. నూతన విద్యావిధానం పేరుతో మతతత్వాన్ని సిలబస్‌లోకి చేరస్తున్నారని, నూతన విధానం పేద విద్యార్థులను చదువుకు దూరం చేస్తుందని చెప్పారు. ఈ విధానాలను రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం దారుణమన్నారు. విద్యారంగం బలోపేతానికి బడ్జెట్‌లో 30శాతం నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయులను స్వేఛ్చగా పాఠాలు చెప్పనీయకుండా మరుగుదొడ్ల ఫొటోలు పెట్టాలంటూ, మధ్యాహ్న భోజన రికార్డులు నమోదు చేయాలంటూ బోధనేతర పనులు చేయిస్తున్నారని విమర్శించారు. ఒకటో తేదీన విజయవాడ సిదార్ధ కళాశాలలో యుటిఎఫ్‌ స్వర్ణోత్సవం నిర్వహిస్తామని, ఉపాధ్యాయులు భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు. యుటిఎఫ్‌ రాష్ట్ర గౌరవాధ్యక్షులు కె.శ్రీనివాసరావు మాట్లడుతూ హక్కులు కోసం మనం కలిసి కట్టుగా పోరాడలని పిలుపునిచ్చారు. కార్యక్రమాల్లో కార్యక్రమంలో యుటిఎఫ్‌ జిల్లా గౌరవ అధ్యక్షులు కె.శ్రీనివాసరెడ్డి, కోశాధికారి జెసిడి నాయక్‌, జిల్లా సహాధ్యక్షులు, ఎం.మోహన్‌రావు, భాగేశ్వరిదేవి, నాయకులు జి.సుధాకర్‌రెడ్డి, ఎన్‌.సుందరరావు, టి.వెంకటేశ్వర్లు, కె.ఉషా శౌరిరాణి, వై.శ్రీనివాసరావు, పి.యోనా, కె.వెంకటేశ్వరరావు, ఓ.కోటేశ్వరరావు, జి.శ్రీనివాసరావు, ఎం.రామాంజనేయులు, రాజశేఖర్‌. ఎం.రవిబాబు, అజరు కుమార్‌, ఎం.పోలయ్య, జి.నాగరాజు, బి. కొండయ్య మాస్టారు, ఎ.నాగేశ్వరావు, జి.నాగేంద్రుడు, ఈ. వెంకట్‌రెడ్డి, బి.ప్రభాకర్‌, పి. రమేష్‌బాబు, సిహెచ్‌.తిరుపతిరెడ్డి, జి.రామారావు, బి.భీమ్లా, రవికుమార్‌, బి.భాస్కర్‌రావు, సిహెచ్‌.మల్లికార్జున, గోపరాజు, వెంకటరెడ్డి, జెవి.నారాయణ, జమాల్‌, ఎంవి సాంబశివరావు, డి.శ్రీనివాసరావు, షేక్‌ పిరోజ్‌బాష పాల్గొన్నారు.