Sep 24,2023 00:08

భీమిలి ఆర్డీవో కార్యాలయం ఎదుట ధర్నా చేస్తున్న ఉపాధ్యాయులు

ప్రజాశక్తి -యంత్రాంగం
భీమునిపట్నం : ఉపాధ్యాయులకు తీవ్రంగా నష్టం కలిగించే జిపిఎస్‌ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఫ్యాప్టో ఆధ్వర్యాన స్థానిక ఆర్డీవో కార్యాలయం ఎదుట శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం ఆర్డీవో ఎస్‌.భాస్కరరెడ్డికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎపిటిఎఫ్‌, ఎంటిఎఫ్‌, యుటిఎఫ్‌ తదితర ఉపాధ్యాయ సంఘాల ప్రతినిధులు సన్యాసిరావు, చంద్రశేఖరరావు, ఎల్‌ఎ.శ్రీనివాసరావు పాల్గొన్నారు.
నర్సీపట్నంటౌన్‌:జిపిఎస్‌ విధానాన్ని నిరసిస్తూ స్థానిక ఆర్డిఓ కార్యాలయం ముందు ఫ్యాప్టో, ఏపీసిపిఎస్‌ ఈఏ ఆధ్వర్యంలో నిరసన ఉపాధ్యాయులు నిరసన చేపట్టారు. సీబీఎం కాంపౌండ్‌ నుంచి అబీద్‌ కూడలి మీదుగా శ్రీకన్య కూడలి వరకు ర్యాలీ సాగింది. జీపీఎస్‌ మాకొద్దు', 'మాట తప్పవద్దు.. మడమ తిప్పవద్దు' అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా యూనియన్‌ నేతలు మాట్లాడుతూ, పాత పింఛన్‌ విధానం పునరుద్ధరిస్తామని పాదయాత్రలో జగన్‌ మాట ఇచ్చి మరిచారన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతి పత్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్‌ జిల్లా ఉపాధ్యక్షులు డి.నూకరాజు, అప్పారావు జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్య ప్రకాష్‌ , రాష్ట్ర కౌన్సిలర్‌ ఆర్‌ దొర పాల్గొన్నారు.