
ప్రజాశక్తి - భీమవరం
సిపిఎస్ రద్దు చేయకుండా జిపిఎస్ అమలు చేసేందుకు బిల్లు ప్రవేశపెట్టి ఏకపక్షంగా ఆమోదించడం అత్యంత దుర్మార్గమని జిపిఎస్‌ను రద్దు చేసేంత వరకూ యుటిఎఫ్ పోరాటం కొనసాగిస్తుందని యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు పిఎస్.విజయరామరాజు అన్నారు. అసెంబ్లీలో జిపిఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించిన బిల్లును వెనక్కి తీసుకోవాలని, డిమాండ్ చేస్తూ గురువారం యుటిఎఫ్ జిల్లా కార్యాలయం నుంచి ప్రకాశంచౌక్ వరకూ ర్యాలీ, ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. జిపిఎస్‌కు సంబంధించిన కాపీలను దహనం చేసి వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు మాట్లాడారు. పాదయాత్ర సమయంలో ముఖ్యమంత్రి జగన్ అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లో సిపిఎస్‌ను రద్దు చేస్తానని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. నాలుగున్నర ఏళ్ల కాలంలో కాలయాపన చేయడం తప్ప ఉద్యోగ ఉపాధ్యాయుల కోసం ఏం చేశారని విమర్శించారు. అసెంబ్లీలో జిపిఎస్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదించడం ఎంతవరకూ సమంజమని ప్రశ్నించారు. జిపిఎస్ రద్దు చేసే వరకూ యుటిఎఫ్ పోరాటం కొనసాగిస్తుందని హెచ్చరించారు. జిల్లా కోశాధికారి సిహెచ్.పట్టాభిరామయ్య మాట్లాడుతూ సిపిఎస్‌కు ప్రత్యామ్నాయం జిపిఎస్ కాదని ఒపిఎస్ మాత్రమేనని హితవు పలికారు. అసెంబ్లీలో ఆమోదించిన మోసపురితమైన జిపిఎస్ బిల్లును వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. వెంటనే అందరికీ పాత పెన్షన్ విధానాన్ని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శులు కెఎస్‌సిహెచ్.సాయిరామ్, సిహెచ్.కుమారబాబ్జి, డి.ఏసుబాబు, కెఎస్.రామకృష్ణ ప్రసాద్, బిజెవిడి.రాజ్యలక్ష్మి, రాష్ట్ర కౌన్సిలర్ జివివి.రామానుజరావు, మండల నాయకులు బి.నాగబాబు, బి.లక్ష్మీనారాయణ, బిఆర్‌ఎంకె.స్వామి, కె.త్రిమూర్తులు, పి.రాజబాబు, సీనియర్ నాయకులు పి.సీతారామరాజు, శ్రీరంగరాజు పాల్గొన్నారు.
తణుకురూరల్:సిపిఎస్, జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్ అమలు చేయాలని యుటిఎఫ్ తణుకు డివిజన్ కన్వీనర్ టిజె.జయకుమార్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసెంబ్లీలో జిపిఎస్ బిల్లు ప్రవేశపెట్టి చట్టం రూపంలో ఆమోదించడాన్ని నిరసిస్తూ గురువారం తహశీల్దార్ కార్యాలయం వద్ద జిఒ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా జయకుమార్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి పాదయాత్రలో సిపిఎస్ రద్దు చేస్తానని ఇచ్చిన హామీని అమలు చేయాలన్నారు. ఒపిఎస్‌కు బదులు జిపిఎస్‌ను చట్టం రూపంలో తీసుకురావడం ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని విమర్శించారు. సిపిఎస్, జిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిలర్ జి.వీరన్న, ఇరగవరం ప్రధాన కార్యదర్శి వీరరాఘవులు, యుటిఎఫ్ ప్రధాన కార్యదర్శి జి.రవి, అత్తిలి ప్రధాన కార్యదర్శి అప్పలరాజు, మండలాల అధ్యక్షులు ఎ.మాణిక్యమ్మ పాల్గొన్నారు.