
ప్రజాశకి-విజయనగరం టౌన్ : ఉద్యోగులకు నష్టం కలిగించే జిపిఎస్ బిల్లు ప్రతులను గురువారం కలెక్టరేట్ వద్ద ఎపి సిపిఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఉద్యోగులు మోకాళ్లపై నిలబడి నిరసన తెలిపారు. పాత పెన్షన్ ఇస్తామన్న హామీని నమ్మి అధికారం ఇచ్చినందుకు తబకు తగిన శాస్తి జరిగిందంటూ ఉద్యోగులు చెప్పులతో కొట్టుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు ఆర్.శివకుమార్ మాట్లాడుతూ సిపిఎస్ విధానం కన్నా జిపిఎస్ విధానం మరింత లోపం భూయిష్టమైనదని అన్నారు. సిపిఎస్ ఉద్యోగుకు ప్రభుత్వమే పెన్షన్ ఇవ్వాలన్నారు. ప్రధాన కార్యదర్శి కె.ధనుంజయ మాట్లాడుతూ సిపిఎస్, జిపిఎస్‌లు వద్దని, పాత పెన్షన్ మాత్రమే కావాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా నాయకులు కంది ఈశ్వరరావు, గంటా త్రినాధ్, శైలాడ అప్పలనాయుడు, కె.లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు.

జిపిఎస్‌కు వ్యతిరేకంగా నిరసన
ఎపిటిఎఫ్1938 రాష్ట్ర సంఘం పిలుపుమేరకు జిపిఎస్‌ను వ్యతిరేకిస్తూ గురువారం కోట జంక్షన్ వద్ద ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. బిల్లు ప్రతులను కాల్చివేసి, నోటికి నల్ల రిబ్బనులు కట్టుకొని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు డి.ఈశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి ఎన్ వై.పైడిరాజు, రాష్ట్ర కార్య కార్యవర్గ సభ్యులు వై.మధుసూదనరావు, జిల్లా అదనపు కార్యదర్శి ఎవి శ్రీనివాసరావు, జిల్లా కార్యదర్శులు వి.అప్పలరాజు, పి.దామోదరనాయుడు, విజయనగరం, గంట్యాడ మండల అధ్యక్షులు సి.హెచ్.పైడితల్లి, వడ్డాది వెంకటరావు ఎన్.కూర్మారావు, జిల్లా కౌన్సిలర్ కె.మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు.
రేపు కలెక్టరేట్ వద్ద ధర్నా : ఎపిటిఎఫ్
పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని కోరుతూ ఈనెల 30న కలెక్టరేట్ వద్ద ధర్నా చేయనున్నట్లు ఎపిటిఎఫ్ జిల్లా శాఖ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు షేక్ బుఖారిబాబు, పాలతేరు శ్రీనివాస్ ఒక ప్రకటన లో కోరారు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని కోరారు. 117 జీవో ని తక్షణం రద్దు చేయాలని,1998, 2008 ఎమ్‌టిఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ ప్రాతిపదికన ఉత్తర్వులు ఇవ్వాలని, ఉద్యోగ విరమణ వయసు 62 చేయాలని కోరారు. కెజిబివి ఉపాధ్యాయులకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ధర్నాలో అధిక సంఖ్యలో ఉపాద్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు.










