Sep 29,2023 22:13

ఫొటో : జిపిఎస్‌ జిఒ పత్రాలు దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు

ఫొటో : జిపిఎస్‌ జిఒ పత్రాలు దగ్ధం చేస్తున్న యుటిఎఫ్‌ నాయకులు
జిపిఎస్‌ జిఒ పత్రాలు దగ్ధం
ప్రజాశక్తి-ఆత్మకూరు అర్బన్‌ : ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించి అమలు చేయాలనుకుంటున్న జిపిఎస్‌ జిఒ పత్రాలను శుక్రవారం యుటిఎఫ్‌ నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్‌ రద్దు చేస్తామని, అధికారంలోకి వచ్చి రద్దు చేయకపోగా సిపిఎస్‌కు శాసనసభలో ఎటువంటి చర్చకు తావివ్వకుండా జిపిఎస్‌ను ఏకపక్షంగా ఆమోదించి అమలు చేయడం చాలా దుర్మార్గమైన చర్య అని అభివర్ణించారు.
ఉద్యోగ ఉపాధ్యాయులను మోసం చేయడమేనని, దానిని నిరసిస్తూ రాష్ట్ర సంఘం పిలుపుమేరకు నిరసన వ్యక్తం చేశామన్నారు. యుటిఎఫ్‌ నాయకులు ఆధ్వర్యంలో ''సిపిఎస్‌ వద్దు జిపిఎస్‌ అసలే వద్దు.. ఒపిఎస్‌ మాకు ముద్దు'' అని నినాదాలు చేశారు. ఒపిఎస్‌ సాధించేంత వరకు యుటిఎఫ్‌ పోరాటం కొనసాగుతుందని తెలియజేశారు. కార్యక్రమంలో ఆత్మకూరు మండల శాఖ అధ్యక్షులు గంగాధర్‌, ప్రధాన కార్యదర్శి ఖాదర్‌ బాషా, జిల్లా కుటుంబ సంక్షేమ శాఖ కార్యదర్శి శివప్రసాద్‌, అనంతసాగరం మండల అధ్యక్షులు వెంకటేశ్వర్లు రెడ్డి, మర్రిపాడు మండల ప్రధాన కార్యదర్శి సుధాకర్‌, యుటిఎఫ్‌ సీనియర్‌ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.