ప్రజాశక్తి-నెల్లూరు :ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆకాంక్షలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి ఆమోదించడం దుర్మార్గమైన చర్య అని యుటిఎఫ్ జిల్లా కమిటీ విమర్శించారు. గురువారం వైసిపి ప్రభుత్వం జిపిఎస్ బిల్లును ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ యూటిఎఫ్ ఆధ్వర్యంలో అన్నమయ్య సర్కిల్ ఎదుట నిరసన చేపట్టారు యుటిఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎన్.నవకోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే సిపిఎస్ విధానం రద్దు చేసి ఓపిఎస్ విధానం అమలు చేస్తామంటూ హామీలు ఇచ్చి నాలుగున్నరేళ్ల తర్వాత చేసిన హామీలకు విరుద్ధంగా జిపిఎస్ విధానం అమలు చేస్తు నిర్ణయం తీసుకొని ఉద్యోగ, ఉపాధ్యాయులను మోసం చేశారన్నారు. జిపిఎస్, సిపిఎస్ విధానాలు వద్దని, ఓపిఎస్ విధానం అమలు చేయాలని డిమాండ్ చేస్తు ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆందోళనలు చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యధోరణగా వ్యవహరిస్తూ జిపిఎస్ బిల్లుకు ఆమోదం తెలపడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. యుటిఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి, అధ్యక్షులు చలపతి శర్న, వి.విశేషులు మాట్లాడుతూ గ్యారెంటీ లేని పెన్షన్ స్కీంను ఆమోదించి ఉద్యోగ , ఉపాధ్యాయులను ఈ ప్రభుత్వం వంచిం చిందన్నారు. చివరగా జిపిఎస్ ప్రతులను దగ్దం చేశారు. యుటిఎఫ్ జిల్లా ఉపాధ్యాక్షులు ఎం.సి అచ్చయ్య, కోశాధికారి ఎ.మురళీదర్‌రావు, జిల్లా కార్యదర్శులు ఎన్.సురేంద్రబాబు, కె.నాగిరెడ్డి, బాలరాఘవయ్య, మండల అధ్యక్ష, కార్యదర్శులు, కార్యకర్తలు పాల్గొన్నారు.










