ప్రజాశక్తి-బొబ్బిలి : ఉద్యోగులు, ఉపాధ్యాయులు సిపిఎస్‌ను రద్దుచేసి ఒపిఎస్‌ను అమలు చేయాలని కోరితే రాష్ట్ర ప్రభుత్వం జిపిఎస్‌ను అమలు చేయడం దుర్మార్గమని యుటిఎఫ్ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి అన్నారు. జిపిఎస్ బిల్లును బుధవారం అసెంబ్లీలో ఆమోదించడాన్ని నిరసిస్తూ ఆ ప్రతుల కాపీలను స్థానిక గాంధీ విగ్రహం వద్ద దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్ర ఉద్యోగులను, ఉపాధ్యాయులను రాష్ట్ర ప్రభుత్వం మోసం చేసిందన్నారు. అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్‌ను రద్దు చేస్తానని ప్రకటించిన జగన్మోహన్‌రెడ్డి ఆ హామీని అమలు చేయకపోగా జిపిఎస్‌ను తీసుకొచ్చి పెన్షన్ లేకుండా చేసింది. రాజ్యాంగ బద్ధమైన పెన్షన్ హక్కును తీసేసిందని తెలిపారు. తక్షణమే బిల్లును ఉపసంహరించు కోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో యుటిఎఫ్ జిల్లా సహాధ్యక్షులు ప్రసన్నకుమార్, కేశవరావు, మన్యం జిల్లా రాష్ట్ర నాయకులు మధుసూధనరావు, జిల్లా నాయకులు సత్యన్నారాయణ, పట్టణ నాయకులు శ్రీనివాస్, రమేష్, సుధాకర్, రామకృష్ణ, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.










