Sep 28,2023 21:06

మదనపల్లె : జిపిఎస్‌ ప్రతులను దహనం చేస్తున్న నాయకులు

మదనపల్లె అర్బన్‌ : ప్రభుత్వం అసెంబ్లీ సాక్షిగా జిపిఎస్‌ అమలుకు చర్యలు చేపట్టడం దుర్మార్గమని యుటిఎఫ్‌ జిల్లా గౌరవాధ్యక్షులు రవిప్రకాష్‌ అన్నారు. జిపిఎస్‌ తేవడాన్ని నిరసిస్తూ గురువారం యూటిఎఫ్‌ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. అనంతరం జిపిఎస్‌ ప్రతులను దగహనం చేశారు. ఈ సందర్భంగా రవి ప్రకాష్‌, జిల్లా కార్యదర్శులు సుధాకర్‌ నాయుడు, పురం వెంకటరమణ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు అధికారంలోకి వచ్చిన వారంలో సిపిఎస్‌ రద్దు చేసి ఒపిఎస్‌ను పున రుద్దరిస్తామని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి నేడు ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులను తీవ్రంగా మోసం చేశారని పేర్కొన్నారు. ఒపిఎస్‌ను అమలు చేస్తే రాష్ట్రానికి తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులని ఆర్థిక మంత్రి పేర్కొనడం హాస్యాస్పదమన్నారు. ఇచ్చిన హామీని తుంగలో తొక్కి ఉద్యోగులను తీవ్రంగా మోసం చేయడం సరికాదన్నారు. జిపిఎస్‌ను తెచ్చే ముందు ఏ ఒక్క ఉద్యోగ ఉపాధ్యాయ సంఘాన్ని కూడా కూర్చోబెట్టుకొని చర్చించకుండా ఏకపక్షంగా జిపిఎస్‌ తేవడానికి తీవ్రంగా వ్యతిరేకిస్తు న్నామన్నారు. ఈ జిపిఎస్‌లో అంత మంచి ప్రతిపాదనలు ఉన్నట్లయితే ప్రస్తుతం ఉన్న మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కూడా జిపిఎస్‌ను ప్రవేశపెట్టాలని డిమాండ్‌ చేశారు. కార్యక్రమంలో డివిజన్‌ నాయకులు సుధాకర్‌ హరికృష్ణ, శ్రీధర్‌, గొబ్రే నాయక్‌, సురేంద్ర, రామయ్య. భానుమూర్తి, ఇర్ఫాన్‌, పయని, గంగులప్ప తదితరులు పాల్గొన్నారు. రాయచోటి: ఎన్నికల ప్రచారం లో మాట ఇచ్చినట్లుగా సిపిఎస్‌ను రద్దు చేసి ఒపిఎస్‌ను పునరుద్ధరించాలని, జిపిఎస్‌ను ఎట్టి పరిస్థితిలోనూ అంగీకరించే ప్రసక్తే లేదని బిటిఎ రాష్ట్ర కార్యదర్శి పల్వం రామచంద్ర పేర్కొన్నారు. పట్టణంలోని తహశీల్దార్‌ కార్యాలయం వద్దనున్న అంబేద్కర్‌ చిత్రపటం వద్ద జిపిఎస్‌ విధానాన్ని వ్యతిరేకిస్తూ నినాదాలు చేశారు. అనంతరం జిపిఎస్‌ ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో సిపిఎస్‌ రద్దుచేసి ఒపిఎస్‌ తీసుకొస్తామని ప్రతి ప్రచార సభలలో పదే పదే చెప్పి నమ్మించిన ముఖ్యమంత్రి ప్రస్తుతం పక్కకు తప్పుకోవడం భావ్యం కాదన్నారు. తాము కోరింది ఉద్యోగి ఎలాంటి కాంట్రిబ్యూషనూ లేని ఒపిఎస్‌ను మాత్రమేనని, లెక్కలు, మాటల లాజిక్కులతో కూడిన జిపిఎస్‌ను కాదని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఎవి.రమణ, ట్రెజరర్‌ గోపాల్‌ దాస్‌, రాజశేఖర్‌, జిల్లా నాయకులు బి రెడ్డయ్య, చిన్న, చెండ్రాయుడు, ప్రసాద్‌ పాల్గొన్నారు.