ప్రజాశక్తి-సీతమ్మధార : జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు, జిఒ 7 ప్రకారం వేతనాలు చెల్లించాలని కోరుతూ జివిఎంసి కాంట్రాక్టు వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యాన అక్కయ్యపాలెంలోని లేబర్ కార్యాలయం వద్ద గురువారం ధర్నా నిర్వహించారు. అనంతరం లేబర్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు పి.వెంకటరెడ్డి మాట్లాడుతూ, జిఒ 7 ప్రకారం రూ.18.500 వేతనాన్ని జివిఎంసి, క్లాప్ కాంట్రాకర్ చెల్లించడంలేదని, వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. కాంట్రాక్టర్లకు లైసెన్సులు, రికార్డులు లేని కారణంగా వారిపై ప్రాసిక్యూషన్ చర్యలకు నోటీసులిస్తానని, సమాన వేతన చట్టం ప్రకారం క్లైమ్‌లు వేసుకుంటే ఆర్డర్ ఇస్తానని లేబర్ కమిషనర్ హామీ ఇచ్చారని వెంకటరెడ్డి తెలిపారు. పి.అనీల్‌కుమార్ అధ్యక్షతన జరిగిన ధర్నాలో యూనియన్ అధ్యక్షులు టి.నూకరాజు, నాయుడు, సీర రమణ, పి.సురేష్ తదితరులు పాల్గొన్నారు.










