ప్రజాశక్తి-పాడేరుcనివారం సామూహిక నిరసన కార్యక్రమం నిర్వహించాయి. స్థానిక అంబేద్కర్ సెంటర్లో 12 గంటలపాటు చేపట్టిన ఈ నిరసన కార్యక్రమానికి జిల్లాలోని 22 మండలాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. గిరిజన సంక్షేమ ఉపాధ్యాయుల సంఘం తరఫున జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కే.నీలకంఠం, శోభన్‌బాబు హాజరై నిరసనకు మద్దతు తెలిపారు. సిపిఎస్, 117 జీవో రద్దు చేయాలని, ఉపాధ్యాయుల పట్ల ప్రిన్సిపల్ సెక్రెటరీ ప్రవీణ్ ప్రకాష్ వైఖరి మారాలని, రెండు నెలలు కిందట నెలలు బదిలీ అయిన ప్రధానోపాధ్యాయులు, ప్రమోషన్లు పొందిన ఉపాధ్యాయులకు వెంటనే జీతాలు మంజూరు చేయాలని ఉపాధ్యాయులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర నేత పి.అప్పలనరస మాట్లాడుతూ, ఉపాధ్యాయుల పోరాటాలపై రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాలకు పూనుకోవడం సరికాదన్నారు.ఉపాధ్యాయుల పోరాటాలను అణిచివేతకు ప్రభుత్వం ప్రవీణ్ ప్రకాష్ వంటి అధికారులపై ఒత్తిడి చేస్తున్నట్లు తేటతెల్లమవుతోందన్నారు. సిపిఎస్ రద్దు చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీని తుంగలో తొక్కారని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్పొరేట్ శక్తులకు దాసోహమై ఆదివాసీల హక్కుల్ని కాలరాస్తున్నాయని దుయ్యబట్టారు.గిరిజనులకు నూరు శాతం రిజర్వేషన్ కల్పించే జీవో 3 పునరుద్ధరణకు, నూతన అటవీ చట్టం రద్దు కోసం జరుగుతున్న పోరాటాల్లో ఉద్యోగులు, ఉపాధ్యాయ వర్గాలు భాగస్వాములవ్వాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో అల్లూరి జిల్లా చైర్మన్ రావుల జగన్మోహన్, ప్రధాన కార్యదర్శి ముఖి రామకృష్ణ, వైస్ చైర్మన్ వెంకటరమణ, జేఏసీ కన్వీనర్ రామారావు దొర, గిరిజన ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు ముఖి శేషాద్రి మాట్లాడుతూ, జీవో 117తో విద్యావ్యవస్థ సంక్షోభంలో పడుతుందని ఉపాధ్యాయ సంఘాలు చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు.ఉపాధ్యాయులపై కక్ష సాధించే ధోరణిని ప్రభుత్వం విడనాడాలని, ఉపాధ్యాయులపై ఉద్దేశపూర్వకంగా చేస్తున్న దుష్ప్రచారాలను విడనాడాలన్నారు. ఉపాధ్యాయులను కించపరిచే పద్ధతులు సమాజానికి మంచిది కాదని హితవు పలికారు. ఈ కార్యక్రమంలో ఏపీసీపీ ఎస్సిఈఎ జిల్లా అధ్యక్షుడు ఎం.ఈశ్వరరావు, గిరిజన ఉద్యోగుల సంఘం జిల్లా కార్యదర్శి బి.సింహాచలం, జేఏసీ నాయకుడు ఎస్ గంగరాజు, జిల్లాలోని వివిధ మండలాల ఉపాధ్యాయులు, ఆయా సంఘాల నేతలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.










