ప్రజాశక్తి-పాడేరు: మన్యంలో భోగి మంటలు ఉవ్వెత్తున ఎగిసాయి. భోగి పండగను పురస్కరించుకొని శనివారం వేకువ జామున మంచు కురుస్తున్న వేళ మన్యంలో వాడవాడలా ప్రజలు భోగిమంటలు వేసుకుని చలి కాచుకుంటూ రంగవల్లులు వేస్తూ సంతోషంగా సంక్రాంతి సంబరాలకు ఆహ్వానం పలికారు. పలుచోట్ల భోగి మంటల్లో గిరిజన సంఘం నాయకులు, గిరిజన ప్రజలు, జీవో నెంబర్ 1 ప్రతులను, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పంద పత్రాలను వేసి దగ్ధం చేశారు. చింతపల్లి మండలం చౌడిపల్లిలో జీవో 1 కాపీలను గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి చిరంజీవి ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవో 1ను తక్షణమే రద్దు చేయాలని గిరిజన సంఘం నాయకులు నినాదాలు చేశారు. చింతపల్లి మండలం చౌడుపల్లి పంచాయతీ వాముగడ్డ గ్రామంలో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ ఒప్పంద పత్రాలను భోగి మంటల్లో వేసి దగ్ధం చేసి గిరిజనులు తమ నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం మండల ప్రధాన కార్యదర్శి సాగిన చిరంజీవి మాట్లాడుతూ, గతంలో ప్రతిపక్షంలో ఉన్న సిఎం జగన్ పాదయాత్ర చేసినప్పుడు అప్పటి ప్రభుత్వం ఇటువంటి జీవోలు తెచ్చి ఉంటే పాదయాత్ర చేయ గలిగేవారా అని ప్రశ్నించారు. అందలమెక్కిన వైయస్ జగన్ ఇప్పుడు ఓటమి భయంతో ఇటువంటి జీవోను తెరపైకి తీసుకు వచ్చారని విమర్శించారు. ఇది జగన్ నియంత పాలనకు నిదర్శనమని, ప్రజల గొంతునొక్కే ఈ చీకటి జీవోణష్ట్ర రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా పలుచోట్ల గిరిజన సంఘం ఆధ్వర్యంలో భోగి మంటల్లో జీవో 1 కాపీలు, హైడ్రో పవర్ ప్రాజెక్టు ఒప్పంద పత్రాలు దహనం చేసి తమ నిరసన గళం వినిపించారు. ఈ కార్యక్రమంలో సాగిన రాము, సత్యనారాయణ, సాగిన వీరన్నపడాల్, నాగరాజు, టి రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.
అనంతగిరి:రాష్ట్ర ప్రభుత్వం ఏకాపక్ష నిర్ణయంతో విడుదల చేసిన జీవో 1, హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణాలకు సంబంధించిన కాపీలను భోగి మంటలలో దగ్ధం చేశారు. సిపిఎం జెడ్పిటిసి దీసరి. గంగరాజు, అనంతగిరి సర్పంచ్ సోమ్మెల రూతులు బొడ్డాచెట్టు కాలనీ గ్రామంలో భోగి మంటలలో జీవో 1 కాపీలను స్థానిక ప్రజలతో కలిసి దగ్ధం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో జీవోలు విడుదల చేసి భయ భ్రాంతులకు గురి చేస్తుందన్నారు. చీకటి జిఒలను రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే వెనక్కు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మండలంలోని టోకురు పంచాయతీ చిట్టంవలస, పెద్దకోట పంచాయతీ రేగులపాలెం, గుమ్మకోట పంచాయతీ గుజ్జలి ప్రాంతాలలో నిర్మించే హైడ్రో పవర్ ప్రాజెక్టులను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. గిరిజన ప్రజల బతుకులు నాశనం చేసే హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణాలను తక్షణమే రద్దు చేయాలన్నారు. గ్రామాలలో సర్వేలకు వచ్చిన అదాని, .అంబిని సంస్థలకు చెందిన బృందాలకు తరిమి కొట్టడం జరిగిందన్నారు. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెళ్లక్కు తగ్గక పోతే పోరాటాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి ఎస్.నాగులు, బి.శేఖర్ కె.శివ, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్: మండలంలోని శరభగూడ గ్రామంలో బోగి మంటల్లో హైడ్రో పవర్ ప్రాజెక్ట్ అనుమతి పత్రాలను సిఐటియు నాయకులు దగ్దం చేశారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు పి.బాలదేవ్ మాట్లాడుతూ, ఐదో షెడ్యూల్ ఏరియాలో ప్రైవేట్ కార్పొరేట్ కంపెనీలు ప్రాజెక్ట్‌ల నిర్మాణం చేపట్ట రాదని సుప్రీంకోర్టు తీర్పులున్నప్పటికీ వాటిని ధిక్కరించి రాష్ట్ర ప్రభుత్వం క్యాబినెట్‌లో ఆమోదించడం తగదన్నారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.గిరిజన సలహా మండలి (టి.ఏసి)లో తీర్మానం లేకుండా కార్పొరేట్ కంపెనీలకు అప్పగిస్తూ క్యాబినెట్ ఆమోద నిర్ణయం చట్ట వ్యతిరేకమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఏకపక్షంగా గత రెండు సంవత్సరాల నుండి హైడ్రో పవర్ ప్రాజెక్ట్ నిర్మాణం కోసం దొంగచాటుగా టూరిస్ట్‌ల పేరుతో సర్వే వహించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.రాష్ట్ర ప్రభుత్వం రోడ్డు షోలు, బహిరంగ సభలు, సమావేశాలు నిర్వహించకూడదని జారీ చేసిన జీవో 1 తక్షణమే రద్దు చేయాలని చెప్పారు.ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు మగ్గన్న, సహదేవ్, గిరిజన సంఘం నాయకులు జగన్నాథం, గోపాల్, అర్జున్, మొంగు నాయుడు, తదితరులు పాల్గొన్నారు
విఅర్.పురం : జీవో 1 రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ మండల కేంద్రం రేఖపల్లిలోని భోగి మంటల్లో జీవో కాపీలను సిపిఎం నాయకులు దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్న బాబు మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయ, అసంఘటిత రంగాలతో పాటు వామపక్షాల ఉద్యమాలను అణచివేసే కుట్రలో భాగంగానే జీవో 1ను రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు పంకు సత్తిబాబు, నల్లారపు ప్రకాశరావు, లింగమూర్తి, కారం సత్తిబాబు, సరిహద్దు రాజేశ్వరరావు, మానికల సూరిబాబు, మొగిలి పువ్వు, సతీష్, వరహాలరావు పాల్గొన్నారు.
ఎటపాక:రోడ్లపై ర్యాలీలు, రోడ్ షోలు వంటివి నిషేధిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెంబర్ 1 ప్రతులను సిపిఎం ఆధ్వర్యాన శనివారం మండలంలోని గుండాల కాలనీలో భోగిమంటల్లో వేసి దగ్ధం చేశారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి ఐవి మాట్లాడుతూ నాడు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడుతున్న భారతీయులను నిర్బంధించటం కోసం 1861లో ఆంగ్లేయులు తెచ్చిన ప్రజా వ్యతిరేక చట్టాన్ని ఈనాడు ముఖ్యమంత్రి తీసుకురావటం దారుణమన్నారు. అందుకే ఈ జీవోను రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐ పద్మ, ఎన్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.










