ప్రజాశక్తి - అద్దంకి
జిఒ నెంబర్ 70, 71రద్దు చేయాలని కోరుతూ ఎస్‌డబ్ల్యుఎఫ్ ఆధ్వర్యంలో గంగాధర్ అధ్యక్షతన సోమవారం ధర్నా నిర్వహించారు. కార్మికులు సెలవు సమస్యతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని గంగాధర్ అన్నారు. సెలవుల విషయంలో సిఐ ఇబ్బందులకు గురిచేస్తున్నారని అన్నారు. కండక్టర్లను ఎక్కువగా ఓడిలుగా ఉపయోగించి సెలవు సమస్య తీవ్రం చేశారన్నారు. కార్మికుల కనీస అవసరాలు గుర్తించి సెలవు మంజూరు చేయాలని కోరారు. ఎస్‌డబ్ల్యుఎఫ్ జిల్లా కార్యదర్శి తిరుపతిరెడ్డి మాట్లాడుతూ కార్మికులను కట్టు భానిసలు చేస్తున్న జిఓ నెం.70, 71 రద్దు చేయాలని కోరారు. ఈ జిఒపై ఎస్‌డబ్ల్యూఎఫ్ గతంలో సుప్రీంకోర్టుకు వెళ్లినట్లు తెలిపారు. కోర్టు జడ్జిమెంటును రిజర్వులో ఉంచిందని తెలిపారు. గతంలో ఈ జిఒలో 32క్లాజులు ఉంటే ఇప్పుడు 54క్లాజులు జోడించి జిఓ విడుదల చేయడం దారుణమని అన్నారు. దీనిని రద్దు చేసి 1/2019 సర్క్యులర్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. డిపో కార్యదర్శి సుబ్బారావు మాట్లాడుతూ కార్మికులకు సెలవు ఇచ్చి డిడిలు చేయించుకునే విధంగా ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవలంబించాలని కోరారు. కార్మికులను బలవంతంగా సిక్‌లోకి పంపే విధానాన్ని మార్చుకోవాలన్నారు. కార్యక్రమంలో బీబి జాన్, శ్రీనివాసరావు పాల్గొన్నారు.










