Jan 06,2023 23:10

ప్రజాశక్తి - జంగారెడ్డిగూడెం
               రాష్ట్రంలో రోడ్‌షోలు, ర్యాలీలను నియంత్రించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జిఒ నెం.1ని తక్షణమే ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యాన శుక్రవారం ఆ జిఒ ప్రతులను దహనం చేశారు. ఆ పార్టీ మండల కార్యదర్శి ఎం.జీవరత్నం అధ్యక్షతన చేపట్టిన ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి ఎ.రవి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికే జిఒ నెం.1ని తీసుకొచ్చిందన్నారు. పోలీసులకు సర్వాధికారాలు కట్టబెట్టడం ప్రజాస్వామ్య వ్యవస్థకే ప్రమాదమన్నారు.ఇప్పటికే కార్మికులు, రైతులు, ప్రజలు తమ కోర్కెలు, హక్కుల కోసం ఆందోళనలు చేయకుండా రాష్ట్ర ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం అణచివేస్తుందన్నారు. ముందస్తు అరెస్టులతో సభలకు, ర్యాలీలకు అనుమతినివ్వడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రధాన పట్టణాల్లో సభలు జరుపుకోడానికి అవసరమైన మైదానాలను కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ జిఒ రద్దు కోసం సాగే పోరులో ప్రజాతంత్రవాదులు, అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, పౌరహక్కుల సంఘాలు, ఐక్య కార్యాచరణకు కలిసి రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పి.రామకృష్ణ, గుడెల్లి వెంకట్రావు, పసల సూర్యారావు, జి.సూర్యకిరణ్‌, ఎస్‌కె.సుభాషిని, అందుగుల ప్రభాకరరావు, పి.దుర్గారావు పాల్గొన్నారు.