ప్రజాశక్తి - బుట్టాయగూడెం
సభలు, సమావేశాలు, ప్రదర్శనలు నిర్వహించరాదంటూ రాష్ట్రప్రభుత్వం ఇటీవల విడుదల చేసిన జిఒ నెం.1ని తక్షణం రద్దు చేయాలని సిపిఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం స్థానికంగా సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. అనంతరం జిఒ నెం.1 ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా రవి మాట్లాడుతూ వైఎస్. జగన్మోహన్‌రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తాను నిర్వహించిన పాదయాత్ర, నిరసన కార్యక్రమాలు గుర్తు లేవా అని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రభుత్వ తీరు ప్రజాస్వామ్య హక్కులకు విరుద్దమని ఆయన విమర్శించారు. పౌరహక్కులను హరించే ఈ జిఒను తక్షణం రద్దు చేయాలని, లేనిపక్షంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు తెల్లం రామకృష్ణ, ఎం.నాగమణి, జిల్లా కమిటీ సభ్యులు ఎం.జీవరత్నం, టి.సత్యనారాయణ, నేతలు పోలోజు నాగేశ్వరరావు, కె.భాస్కర్, చోడెం దుర్గ తదితరులు పాల్గొన్నారు.










