
ప్రజాశక్తి -మధురవాడ : జివిఎంసి క్లాప్ వాహన డ్రైవర్లకు జిఒ 7 ప్రకారం రూ.18,500 వేతనం ఇవ్వాలని సిఐటియు నాయకులు డిమాండ్‌చేశారు. క్లాప్ డ్రైవర్లు మంగళవారం చేపట్టిన సమ్మె రెండో రోజు బుధవారమూ కొనసాగింది. 7వ వార్డు కార్యాలయం, వాహనాల యార్డు వద్ద బుధవారం బైఠాయించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా యూనియన్ మధురవాడ జోన్ నాయకులు ఎస్.చిన్న, కె.సన్నీ మాట్లాడుతూ, ఏడాదిగా పోరాడుతున్నా సమస్యలు పరిష్కరించకుండా వాయిదాలు వేస్తూవస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. సిఐటియు మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శి పి.రాజ్‌కుమార్ మాట్లాడుతూ, పెరుగుతున్న నిత్యవసర వస్తువులు ధరలు, ఇతర కనీస అవసరాలు తీరాలంటే రూ.26 వేలు జీతం ఉండాలన్నారు. క్లాప్ డ్రైవర్లు సమ్మెకు తమ పూర్తి మద్దతు ఉంటుందన్నారు. రూ.18,500 వేతనం ఇచ్చే వరకు ఈ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో యూనియన్ నాయకులు పి అశోక్, పి శ్రీను, బి శివ, రాంబాబు డ్రైవర్లు పాల్గొన్నారు.