Sep 16,2023 20:43

సమావేశంలో మాట్లాడుతున్న రామచంద్రర

రాయచోటి : పంటల బీమాపై ప్రభుత్వం విడుదల చేసిన జిఒ నెంబర్‌ 660ని వెంటనే రద్దు చేయాలని ఎపి రైతు సంఘం జిల్లా కార్యదర్శి సిరిపురం రామచంద్ర అన్నారు. శనివారం కొత్తపేటలోని సిపిఎం కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 2023-24 పంటల బీమాలో ప్రయివేట్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీల ప్రవేశం నిలిపివేయాలన్నారు. ప్రభుత్వమే పంటల బీమా అమలు చేయాలన్నారు. 2023-24 ఖరీఫ్‌ సీజన్‌లో పంటల బీమా అమలుకు ప్రభుత్వం ఇన్సూరెన్స్‌ కంపెనీలతో బిడ్డింగ్‌ నిర్వహించిందిన్నారు. 2020 నుండి 2023 వరకు మూడు సంవత్సరాల పంటల బీమా అమలు అనుభవం పరిశీలిస్తే ప్రభుత్వం నేరుగా పంటల బీమా అమలు చేసిన 2020-21లో రూ.1700 కోట్లు, 2021-22లో రూ.2,900 కోట్లు రైతులకు పంటల బీమా రూపంలో ప్రయోజనం కలిగిందని పేర్కొన్నారు. 2022-23లో ఇన్సూరెన్స్‌ కంపెనీల ద్వారా అమలు జరిగిన పంటల బీమా పథకం వలన రైతులకు కేవలం రూ.1100 కోట్లు మాత్రమే బీమా పరిహారం వచ్చిందని తెలిపారు. పంటల బీమా పధకం ప్రభుత్వమే తన బాధ్యతగా అమలు చేయాలన్నారు. ప్రధానమంత్రి ఫసల్‌ బీమా పాలసీ ఇన్సూరెన్స్‌ కంపెనీల లాభాల కొరకే తప్ప రైతుల ప్రయోజనం కొరకు కాదన్నారు. కనుక ప్రధాన మంత్రి ఫసల్‌ బీమా అమలు నిలిపివేయాలని పేర్కొన్నారు. 2022-23 సంవత్సరంలో పంటల నష్ట పోయినా పంటల బీమా అమలు కాని రైతులు అందరికీ పంటల బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలిని డిమాండ్‌ చేశారు. సమావేశంలో ఎపి రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు వి.వెంకటరమణారెడ్డి పాల్గొన్నారు.