Jun 20,2023 00:03

పాడేరులో వినతిపత్రం అందజేస్తున్న సురేంద్ర, నాయకులు

ప్రజాశక్తి-పాడేరు:జిఒ 3కు చట్టబద్ధత కల్పించి గిరిజనేతర ఉపాధ్యాయులను ఏజెన్సీకి చేసిన బదిలీలను వెంటనే రద్దు చేయాలని ఎపి ఆదివాసి గిరిజన సంఘం నేతలు సోమవారం మండల రెవెన్యూ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొద్దు బాల్‌ దేవ్‌ మాట్లాడుతూ, జి.ఓ 3 నిబంధనల ప్రకారం పాడేరు ఏజెన్సీలో ప్రభుత్వ ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ నిర్వహించాలన్నారు. జిఓ 3పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ నడుస్తుడంగా ఏజెన్సీలో మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనేతర సెకండరీ గ్రేడ్‌ టీచర్లు (ఎస్జీటి) 400 మందిని వివిధ ప్రభుత్వ పాఠశాలలకు బదిలీ చేయడం తగదన్నారు. గిరిజనేతర ఉద్యోగులను గిరిజన ప్రాంతానికి తరలించడం గిరిజన హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందని అన్నారు. తసీల్ధార్‌ కార్యాలయ సీనియర్‌ అసిస్టెంట్‌ వెంకటరమణ వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు సుందరరావు, మండల కార్యదర్శి సత్యనారాయణ, పాపారావు, కృష్ణ, దాసు ,తదితరులు పాల్గొన్నారు.
అరకులోయ రూరల్‌:జిఓ 3ను చట్టబద్దత కల్పించి మైదాన ప్రాంత గిరిజనేతర ఉపాధ్యాయుల ఏజెన్సీలో బదిలీలను వెంటనే రద్దు చేయాలని ఏపీ ఆదివాసి గిరిజన సంఘం నాయకులు డిమాండ్‌ చేశారు. తహశీల్దార్‌ కార్యాలయంలో ఆర్‌ఐకు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఆదివాసీ గిరిజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కిల్లో సురేంద్ర మాట్లాడుతూ, గిరిజనేతర ఉద్యోగులను గిరిజన ప్రాంతానికి తరలించడం గిరిజన హక్కులకు తీవ్ర భంగం కలిగించే విధంగా ఉందని తక్షణమే బదిలీలు రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం జి.ఓ 3పై ఎందుకు రివ్యూ పిటిషన్‌ దాఖలు చేయలేదని ప్రశ్నించారు.జిఓ 3 నిబంధనల ప్రకారం పాడేరు ఏజెన్సీ ప్రాంతంలో గిరిజన ప్రాంత ఉపాధ్యాయుల గిరిజన ప్రాంతాల్లో బదిలీలు ప్రక్రియ మొదలు పెట్టాలని డిమాండ్‌ చేశారు.ఈ కార్యక్రమంలో ఆదివాసి గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పి.బాలదేవ్‌, మండల అధ్యక్ష కార్యదర్శులు రామన్న, బుజ్జి బాబు, కె.జగనాధం, ఆనంద్‌, హరి, తదితరులు పాల్గొన్నారు.
డుంబ్రిగుడ:జిఒ 3కు చట్టబద్ధత కల్పించాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం అల్లూరి జిల్లా ఉపాధ్యక్షుడు సూర్యనారాయణ డిమాండ్‌ చేశారు. తహాసిల్దార్‌ సిహెచ్‌ నాగమ్మకు సోమవారం వినతిపత్రం అందజేశారు. గిరిజనేతర ఉపాధ్యాయులను గిరిజన ప్రాంతానికి బదిలీ చేయడమంటే గిరిజన హక్కులకు తీవ్ర భంగం కలిగించడమే అవుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం మండల నాయకులు పి.మోహన్దాస్‌ పాల్గొన్నారు.
ముంచింగిపుట్టు: జీవో 3కు చట్టబద్ధత కల్పించాలని తహశీల్దార్‌ నరసమ్మకు ఎపి ఆదివాసి గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యుడు కొర్ర త్రినాథ్‌ వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా త్రినాధ్‌ మాట్లాడుతూ,జి ఓ 3 పై సుప్రీంకోర్టులో పిటిషన్‌ నడుస్తుండగా మైదాన ప్రాంతానికి చెందిన గిరిజనేతర సెకండరీ గ్రేడ్‌ టీచర్లను ఏజెన్సీకి బదిలీ చేయడం దుర్మార్గమన్నారు. దీంతో గిరిజన హక్కులకు తీవ్ర భంగం కలుగుతుందన్నారు. బదిలీలను తక్షణమే రద్దు చేయకుంటే దశలవారీగా ఆందోళన చేపడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మండల వైస్‌ ఎంపిపి1 పి.సత్యనారాయణ, నాయకులు పి.భీమరాజు, ఎస్‌.దొన్ను పాల్గొన్నారు.
పెదబయలు :జిఓ 3ఎ చట్ట బద్దత కల్పించాలని తహసీల్దార్‌కు ఎపి ఆదివాసీ గిరిజన సంఘం నేత సాగిన ధర్మన్న ఆధ్వర్యంలో వినతి సమర్పించారు. సాగిన ధర్మన్న మాట్లాడుతూ, కోర్టు తీర్పు రాకుండా కొత్త నియమాలు, బదిలీలు చేపట్టడం చట్ట విరుద్దమన్నారు. బదిలీలను నిలుపుదల చేపట్టకుంటే ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమం లో జిల్లా కమిటీ సభ్యురాలు టి.కౌసల్య, జె.సునీల్‌, కె శరబన్న, అచ్యుతరావు పాల్గొన్నారు.
హుకుంపేట:తహశీల్దార్‌ రాజ్యలక్ష్మీకి ఆదివాసీ గిరిజన సంఘం ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా గిరిజన సంఘం అధ్యక్ష కార్యదర్శులు
కె.రామారావు, టి.కృష్ణారావు మాట్లాడుతూ, మైదాన ప్రాంతం నుండి బదిలీలను తక్షణమే రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు.
జి.మాడుగుల:తహసీల్దార్‌కు ఆదివాసీ గిరిజన సంఘం నేతలు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆదివాసి గిరిజన సంఘం మండల కార్యదర్శి కొటారి కోటేశ్వరరావు, జివో 3 సాధన కమిటీ జిల్లా సహాయ కార్యదర్శి మత్స్యరాస నారాయణరాజు, మాట్లాడుతూ జీవో 3ని పునరుద్దరించాలన్నారు. ఆదివాసీ గిరిజన సంఘం పూర్వ మండల కార్యదర్శి జె దీనబంధు, కరుణానిధి, జివో 3 సాధన కమిటీ నాయకులు సన్యాసి పడాల్‌, రత్నకుమారి పాల్గొన్నారు.
కొయ్యూరు: జీవో 3 ప్రకారం ఏజెన్సీలో గిరిజన ఉపాధ్యాయులని నియమించాలని ఎపి ఆదివాసీ గిరిజన సంఘం మండల అధ్యక్షుడు జె.పెంటయ్య, కార్యదర్శి పి.గంగరాజు డిమాండ్‌ చేశారు. ఈ మేరకు సోమవారం స్థానిక తహశీల్దార్‌ కార్యాలయంలో తహశీల్దారు తిరుమల రావుకి వినతిపత్రం అందజేశారు. జీవో నెంబర్‌ 3పై సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ ఉండగా, 400 మందిని వివిధ పాఠశాలలో బదిలీ చేయడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకుడు ఇరువాడ దేముడు, గిరిజన సంఘం నేత సరుమూర్తి సూరిబాబు పాల్గొన్నారు.